
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ భూకంప మృతుల సంఖ్య 950కి చేరింది. సుమారు 950 మంది మరణించగా, 600 మందికి పైగా గాయపడినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు రాయిటర్స్‌కి తెలిపారు. చట్టూ ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉండటం, మారుమూల గ్రామం కావడంతో స్పష్టమైన సమాచారం లేదని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2002 అనంతరం బుధవారం నాటి భూకంపం అత్యంత తీవ్రమైనదని అధికారులు తెలిపారు. ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు, పక్టికా ప్రావిన్స్‌కు 44 కి.మీ దూరంలో, పాకిస్తాన్ సరిహద్దులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిసి) తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని అన్నారు. బుధవారం అర్థరాత్రి భూకంపం సంభవించిందని, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చిక్కుకున్నాయని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆఫ్ఘనిస్తాన్ మీడియా టోలో ట్వీట్ చేసింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సాయం అవసరమని ఆఫ్ఘన్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రపంచ దేశాలను కోరింది. అయితే పాకిస్తాన్లో ప్రాణ, ఆస్తి నష్టం కి సంబంధించిన సమాచారం తెలియదని పేర్కొంది.