Jun 28,2022 15:10

బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాంధోళనలకు గురయ్యారు. ముఖ్యంగా కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మూడు నుంచి ఏడు సెకన్ల పాటు భూమి ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాంధోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనల సమయంలో ఫర్నీచర్‌, రూఫింగ్‌ టాప్‌ షీట్లతో పాటు ఇంట్లో వస్తువులు కదిలాయని స్థానికులు పేర్కొన్నారు. మంగళవారం రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. బెంగళూరుకు 238 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మూడు రోజుల క్రితం సుల్లియాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.కర్నాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భూకంపాలను నిశితంగా పరిశీలిస్తున్నది.