Aug 10,2022 07:04

ఇప్పుడు ఆ రాజ్యాంగ విలువలపైనే దాడి చేస్తున్న రాజకీయ శక్తులు కేంద్రంలో అధికారంలో వుండడం పెద్ద విషాదం. ఆ దాడి నుంచి రాజ్యాంగాన్ని, మన పెద్దలు అందించిన స్వాతంత్య్రపు వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అందరికీ ఓటుహక్కు ద్వారా రాజకీయ సమానత్వం వచ్చింది కాని... ఆర్థిక, సాంఘిక సమానత్వాన్ని సాధించకపోతే దానికి విలువ వుండదని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏనాడో హెచ్చరించారు. ఆ ఆర్థిక, సాంఘిక సమానత్వాన్ని సాధించే మహోద్యమంలో మనమంతా చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం.

దేశ ప్రజలలో అత్యధికులు దారిద్య్రంలో మగ్గిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని దాటి గెలాక్సీలను తాకుతున్నాయి. భారతదేశం అస్పుృశ్య భారతంగా మరింత దిగజారుతున్నది. మనుస్మృతి కొత్త భాషతో పాలకుల నోట పలుకుతున్నది. స్త్రీలపై అమానవీయమైన దాడులు నిరంతరంగా జరుగుతున్నాయి. మద్యం, మత్తు మందులు భారతాన్ని వణికిస్తున్నాయి. యువత మద్యం మత్తులో తమ జీవన సోపానాన్ని కూల్చుకుంటున్నారు.
      నిజానికి భారతదేశంలో 19-20 శతాబ్దాల ప్రారంభంలో మద్యపాన నిషేధ ఉద్యమాలు జరిగాయి. మద్యం మానవ భవితవ్యాన్ని, జ్ఞాన సంపత్తిని నాశనం చేస్తుందని తెలుసుకుని స్వాతంత్య్ర ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు మద్య నిషేధం కోసం పోరాటాలు చేశారు. 1920లో ఒకసారి మద్య నిషేధం జరిగింది. 1933లో ఎత్తివేశారు. 1977లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశారు నాయకత్వం లోని జనతా ప్రభుత్వం మద్య నిషేధానికి ప్రయత్నం చేసింది. లక్షద్వీప్‌, గుజరాత్‌, బీహార్‌, నాగాలాండ్‌, మిజోరాం వంటి రాష్ట్రాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరుగుతున్నది. కేరళ, తమిళనాడులో పాక్షిక నిషేధం అమలు జరుగుతున్నది.
      హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ లలో యథేచ్ఛగా మద్యం ప్రవహిస్తున్నది. మద్యం వల్ల కుటుంబాల ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నది. ఇంకోవైపు అతికొద్ది మంది సంపన్నుల దగ్గర సంపద విపరీతంగా పోగుబడుతోంది. కాని 2016లో భారత్‌ జి.డి.పి లో 66.6 శాతానికి అప్పులు ఉన్నాయి. 2020 నాటికి 84.6 శాతానికి ఆ అప్పులు చేరాయి. 2021 నాటికి 90.6 శాతానికి ఆ అప్పులు మరింత పెరిగాయి. ఈ అప్పులు ఎగ్గొట్టిన వారి పట్ల భారత ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు ఉంటుందో పరిశీలిస్తే వారందరూ పార్టీ ఫండ్‌ ఇచ్చే వారని తేలుతుంది. ఈ లూటీల వల్ల నాలుగు వందల రూపాయల వంటగ్యాస్‌ పదకొండు వందల నలభై రూపాయలకు పెరిగింది. ఇక కూరగాయలు పదుల్లో ఉండేవి వందల రూపాయలు పలుకుతున్నాయి. పెట్రోలు, డీజల్‌ రేట్లైతే వాటికి హద్దు లేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఏ ఉప్పు సత్యాగ్రహం అయితే ప్రసిద్ధి చెందిందో అదే ఉప్పు మీద కూడా ఇవాళ జి.ఎస్‌.టి పడింది. ఈ ధరల పెరుగుదలకు మూల కారణం మతోన్మాద, కార్పొరేట్‌ కూటమి విధానాలే. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే కర్మవాదం చెబుతున్నారు పాలకులు. దేశ వ్యాప్తంగా కర్మ వాదాన్ని బోధించడానికి యోగులను, బాబాలను, దేవుళ్ళ వ్యవస్థను విస్తృతం చేస్తున్నారు. అందుకు వారు యజ్ఞయాగాలను ప్రోత్సహించడమే కాక వర్ణ వ్యవస్థను కూడా విస్తృతం చేస్తున్నారు. వర్ణం అనేది భగవంతుడు సృష్టించిందని దాన్ని ఆచరించడం ద్వారానే స్వర్గ లోకం లభిస్తుందని, దు:ఖం అనేది మానవులకు సహజమని అది దేవుడు కల్పించిందేనని ప్రబోధిస్తున్నారు. ''దు:ఖేశ్వ నుద్విగ మనా: సుఖేశు విగత స్పృహా:వీత రాగ భయక్రోథ: స్థిత ధీర్మునిరుశ్చ్యతే''. దు:ఖం కలిగినప్పుడు కలతపడని వాడు, సుఖాల్లో ఆశ లేనివాడు, రాగము, భయము క్రోధము లేనివాడు గొప్పవాడు అని చెబుతున్నారు. దు:ఖం అనేది ఎందుకు కలిగిందో పరిశీలించవద్దంటున్నారు. దు:ఖాన్ని అనుభవించు అని చెబుతున్నారు. దు:ఖం దైవ కృప వల్లే కలుగుతుందని చెబుతున్నారు. దేశంలో ఉన్న ఇరవై ఒక్క కోట్ల మంది నిరుద్యోగులు ''మేం చదువుకుంటున్నాం. మాకు ఉద్యోగం ఎందుకు లేదని'' ప్రశ్నిస్తున్నారు.
      నాయనా! అది మీ కర్మ వలనే గాని, మా తప్పు లేదంటున్నారు పాలకులు. దేశంలో ముప్పై కోట్ల మంది వలస కార్మికులు పని కోసం దూర దూరాలలో జీవిస్తున్నారు. వారికి అక్కడ సరైన వసతి లేక తగరపు పాకల్లో ఉంటున్నారు. రైల్వే స్టేషన్లో పడుకుంటున్నారు. ఒకే ఇంట్లో పది బాత్రూములు, ఇరవై కుళాయిలు ఉన్న కోటీశ్వరులు, మరోపక్క పెరుగుతున్నారు. సుఖ భోగాలు ఎక్కువై తెల్లవారుజాము వరకూ పబ్బుల్లో లక్షల రూపాయలు వెచ్చించి వినోదాన్ని పొందుతున్న వారు ఒకపక్క...షేర్‌ మార్కెట్‌లో ధనాన్ని వెచ్చిస్తూ ధనం అనే జూదంలో జీవితాన్ని ఫణంగా పెట్టే ఆర్థిక ఉన్నతిలో జీవిస్తున్నవారు మరోపక్క ఉన్నారు. దేశంలోని ధనవంతుల జీవన విధానానికి, పేదల సంక్షోభానికి కర్మ వాదాన్ని సమాధానంగా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి అసలు ఇల్లు లేదు. అభాగ్యమైన దుర్గంధ పూరిత మురికి వాడల్లో దోమలతో యుద్ధం చేస్తూ డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా వంటి అనేక విషజ్వరాలతో ప్రజలు మరణపు అంచుల్లో జీవిస్తున్నారు. కరోనా తర్వాత ఏదో ఒక వింత రోగంతో అకస్మాత్తుగా ఎంతోమంది అకారణంగా జబ్బేమిటో కూడా తెలియకుండానే మరణిస్తున్నారు. ఆరోగ్య రక్షణ, భద్రత లేదు. కనీస వైద్య సౌకర్యాలు లేవు. రోగుల్ని భయపెట్టి లేని రోగాన్ని అంటగట్టడంతో రూ. లక్షల్లో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. దోచుకుంటున్న కార్పొరేట్‌ హాస్పిటళ్లు, వైద్యులు, మందుల షాపులపై నియంత్రణ లేదు. అజమాయషీ లేదు. ప్రభుత్వం ప్రజల బాధ్యతలు విస్మరించి కార్పొరేట్ల తొత్తుగా మారిపోయింది.
      చినుకు పడగానే బురద గంటలతో రోడ్లు బావుల్ని తలపిస్తున్నాయి. గ్రామాలన్నీ చెరువులైపోయి జనావాసాలు ఆ ముంపులో తుడిచిపెట్టుకుపోవడం వంటి జీవన సంక్షోభాలకు కారణం ప్రాజెక్టులకు సకాలంలో నిధులు అందించకపోవడం, ప్రాజెక్టులు కట్టడంలో చిత్తశుద్ధి లేకపోవడం, మరోపక్క దేశంలో సెల్‌ ఫోన్లు, బుల్లెట్‌ రైళ్లు, అత్యంత సౌకర్యాలతో కూడిన విమానాలను ధనవంతుల పిల్లలు ఆస్వాదిస్తుంటే మరో పక్క పేద పిల్లలు ఆకలితో స్కూల్‌ అసెంబ్లీలో సొమ్మసిల్లి పడిపోతున్నారు. నిరంతరమైన ఆర్థిక వ్యత్యాసంలో అర్ధ భారతం ఆకలి కేకలతో ఆత్మహత్యా సదృశ్యంగా జీవిస్తున్నది. అగ్నిపథ్‌ పేరుతో యువకుల సైనిక ప్రవేశాన్ని నిరోధించి వారిని కార్పొరేట్‌ కాపలాదారులుగా మార్చే ప్రయత్నం మరోపక్క జరుగుతున్నది.
      ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్నది. డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం మన భారతీయులంతా పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం. ఇప్పుడు ఆ రాజ్యాంగ విలువలపైనే దాడి చేస్తున్న రాజకీయ శక్తులు కేంద్రంలో అధికారంలో వుండడం పెద్ద విషాదం. ఆ దాడి నుంచి రాజ్యాంగాన్ని, మన పెద్దలు అందించిన స్వాతంత్య్రపు వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
     అందరికీ ఓటుహక్కు ద్వారా రాజకీయ సమానత్వం వచ్చింది కాని...ఆర్థిక, సాంఘిక సమానత్వాన్ని సాధించకపోతే దానికి విలువ వుండదని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏనాడో హెచ్చరించారు. ఆ ఆర్థిక, సాంఘిక సమానత్వాన్ని సాధించే మహోద్యమంలో మనమంతా చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం.

/ వ్యాసకర్త : సామాజిక తత్వవేత్త, సెల్‌: 9849741695 /
డా|| కత్తి పద్మారావు

డా|| కత్తి పద్మారావు