
- బిజెపి, ఆప్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం
న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) సమావేశం కాగా, బిజెపి, ఆప్ కౌన్సిలర్ల నినాదాలతో సభ ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కౌన్సిలర్లు ఇష్టారీతీగా వ్యవహరించారు. పోటాపోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, సభను నిరవధికంగా వాయిదా వేస్తూ ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా పడటం ఇది రెండోసారి. జనవరి 6న కూడా ఇదే రీతిలో ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ రోజు సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా నియమించిన ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ మొదట 10మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్ ఎన్నికలో వారు ఓటు వేయడానికి అనుమతి లేదని ఆప్ వెల్లడించింది. క్రితంసారి వారి ప్రమాణ స్వీకారం విషయంలోనూ ఆప్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మేయర్ ఎన్నికను బీజేపీ అనుకూలంగా మార్చేందుకు, ఉద్దేశపూర్వకంగానే వారిని నామినేట్ చేశారని విమర్శించింది. కాగా, మంగళవారం కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. మార్షల్స్‌ను సిద్ధంగా ఉంచారు.