Aug 17,2022 20:56

ప్రజాశక్తి - యంత్రాంగం : విద్యుత్‌ సంస్కరణల చట్టం -2022, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నంబర్‌ 22ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎపి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు చేపట్టారు. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడొద్దని, పంపుసెట్లకు మీటర్లు బిగించొద్దని నినాదాలు చేశారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు ఆందోళన నిర్వహించారు. చట్ట సవరణ బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. అనకాపల్లి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయనగరంలోని విద్యుత్‌ భవనం వద్ద, పార్వతీపురం డిఇ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎస్‌ఇ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. శ్రీకాకుళంలోని ఇపిడిసిఎల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (టెక్నికల్‌) వై.వి.ఆర్‌.కె ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.