
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి ప్రకటించిన మినీ మేనిఫెస్టో జగన్ దుష్టపాలనకు ముగింపు పలకబోతోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. సంక్షేమం ప్రారంభమైందే ఎన్‌టి రామారావు, టిడిపితో అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధి, సామాజిక న్యాయంతో టిడిపి ముందుకు వెళ్తుంటే, లూటీ కోసం అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా జగన్ నాలుగేళ్లుగా పాలన సాగుతోందని విమర్శించారు. మహిళలు, రైతులు, యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తమ నాయకుడు చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ రోజు నుంచి వైసిపి నాయకులు, సిఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు. జగన్ ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని, విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచుతానని హామీ ఇవ్వకపోయినా పెంచారని ఎద్దేవా చేశారు. ఇసుకకు ధర నిర్ణయించి రూ.వేలకోట్లు దోచుకుంటామని మేనిఫెస్టోలో ఉందా? అని ప్రశ్నించారు.