
అంకారా : దేశ అధ్యక్ష ఎన్నికలు వచ్చే మే 14న జరగనున్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జూన్ 18న జరగాల్సి ఉండగా..పరీక్షలు, వ్యవసాయ పనులు వంటి కాలానుగుణ పరిస్థితుల కారణంగా ముందస్తుగా నిర్వహించాలని నిర్నయించినట్లు ఆయన తెలిపారు. మే 14న జరిగే ఎన్నికల్లో మీరు మొదటి సారిగా ఓటు వేస్తారని బుర్సా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన యువజన సదస్సులో ఎర్డోగాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ఆదివారం మీడియాలో విడుదలైంది. నేషనలిస్ట్ యాక్షన్ పార్టీ నేత డెవ్లెట్ బహ్సెలీ, పాలక జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీతో కలిసి జనవరి 17న పీపుల్స్ అలయన్స్ సంకీర్ణ కూటమిని ఏర్పరిచిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కూటమి తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎర్డోగాన్‌ను ప్రకటించినట్లు బహ్సెలీ పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమి ఇంకా అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించలేదు.