Aug 05,2022 20:12

ప్రజాశక్తి-గుంటూరు :పంట డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్న వ్యాపారస్తుడు మెడతాటి లక్ష్మణకుమార్‌ను అరెస్ట్‌ చేసి, తమకు నగదు ఇప్పించాలని కోరుతూ గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం జిల్లా ఎస్‌పి ఆరిఫ్‌ హఫీజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు 30 మంది రైతులకు రూ.3.50 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడారు. దుగ్గిరాల మండలం, ఈమని గ్రామానికి చెందిన లక్ష్మణకుమార్‌ మౌనిక ట్రేడింగ్‌ పేరుతో గత 15 ఏళ్లుగా రైతుల నుంచి వివిధ రకాల పంటలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆయనపౖౖె నమ్మకంతో ఈమని, చిన్నపాలెం, కొలకలూరు, నల్లమేకల పాలెం, రేపల్లె, ఆఫ్‌పేట, నర్సరావుపేటకు చెందిన రైతులు ధాన్యం, మొక్కజన్న, జన్న పంటలు విక్రయించారని చెప్పారు. అతను వ్యాపారం సాగించి, ఇటీవల ఐటీ కూడా చెల్లించాడని, తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని రైతులు వాపోయారు. ఫోన్‌ చేస్తే స్పందించట్లేదని, ఇంటికి తాళం వేసి ఉందని తెలిపారు. మోసపోయామని గ్రహించి గుంటూరు ఎస్‌పికి ఫిర్యాదు చేశామని తెలిపారు.