Aug 05,2022 13:00

విజయవాడ : ప్రజాశక్తి 42 వ వార్షికోత్సవ సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాశక్తి ఫొటో ఎగ్జిబిషన్‌ చూపరులందరికీ మరింత సమాచారాన్నిచ్చింది. సభ ప్రారంభానికి ముందుగా ప్రజానాట్యమండలి గానాలాపన చేసి వీనులవిందు చేసింది. అనంతరం ప్రజాశక్తి సాహితీ సంస్థ తయారుచేసిన ప్రజాశక్తి ప్రస్థానం డాక్యుమెంటరీ వీడియోని ప్రదర్శించారు. 42వ వార్షికోత్సవ ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు.

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ... నేటికాలంలో పెద్దలు కూడా పేపరును చదవడం మానేస్తున్నారని, చిన్నపిల్లలకు అసలు పేపరంటేనే తెలియదని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలంలో కూడా పత్రిక కొనసాగుతుందంటే.. కొందరు విలువలతో కూడిన సమాచారాన్ని ఇస్తున్నారు కాబట్టే కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో పేపరన్నది అసలు కనబడుతుందా ? అనే ప్రశ్న కలుగుతోందన్నారు. విలువలతో కూడిన వార్తలు ఎప్పుడూ రావాలని కోరారు.