Oct 05,2022 16:23

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : జిల్లాలోని ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో సాయిబాబా గుడి సమీపంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అగ్రహారానికి చెందిన పంతాల సూర్య భగవాన్‌, పంతాల ఓంకార్లు ఇంట్లో ఉండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో సూర్య భగవాన్‌, ఓంకార్లు తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండపేట అగ్నిమాపక అధికారి వెంకటరెడ్డి, సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన పార్టీ శ్రేణులతోను, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తన పార్టీ శ్రేణులతో వేర్వేరుగా హాజరై బాధితులను ఓదార్చి వారికి ఆర్ధిక సాయాన్ని అందజేశారు. అలాగే ఆర్డీవో ఎం.ముక్కంటి తహశీల్దార్‌ జి.లక్ష్మీపతి ఆర్‌ఐ జానకి రాఘవ, వీఆర్వో స్వామీజీతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.