Aug 09,2022 10:38

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బిఐ (అమెరికా దర్యాప్తు సంస్థ) సోదాలు నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజామున డొనాల్డ్‌ ట్రంప్‌ విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌, రిసార్ట్‌ మార్‌-ఎ-లిగోను దర్యాప్తు ఏజెన్సీ ఏజెంట్లు చుట్టుముట్టగా.. ఎఫ్‌బిఐ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాలకు సంబంధించి ఎఫ్‌బిఐ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ... మార్‌-ఎ-లెగోలోని పామ్‌ బీచ్‌లోని తన అందమైన నివాసాన్ని ఎఫ్‌బిఐ స్వాధీనం చేసుకుందని అన్నారు. దీనికి కారణం చెప్పలేదు. అయితే, ఎఫ్‌బిఐ దాడుల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ తన నివాసంలో లేరని, ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉన్నట్లు తెలుస్తోంది.

                                                             ఇది రాజకీయ ప్రతీకారం : డొనాల్డ్‌ ట్రంప్‌

సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో పని చేసి, సహకరించిన తర్వాత కూడా తన ఇంటిపై ఈ అనూహ్య దాడి తగినది కాదు అని ట్రంప్‌ తన ప్రకటనలో తెలిపారు. ఎఫ్‌బిఐ చర్య రాజకీయ ప్రతీకారమేనన్నారు. మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు గడ్డు కాలమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో ఇంతకు ముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన నివాసంపై ఆకస్మిక దాడి చేశారని ట్రంప్‌ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తనను పోటీ చేయనీయకుండా ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది అని ట్రంప్‌ ధ్వజమెత్తారు.