Nov 23,2022 21:34

టైటిల్‌ ఫేవరెట్‌, 2సార్లు టైటిల్‌ విజేత అర్జెంటీనాజట్టుకు ఆసియా ఖండానికి చెందిన సౌదీ అరేబియా జట్టు ఝలక్‌ ఇచ్చి 24గంటలు గడవకముందే.. ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్‌-ఇలో ఆసియా ఖండానికే చెందిన మరోజట్టు జపాన్‌ నాలుగుసార్లు ఫిఫా టైటిల్‌ విజేత జర్మనీ జట్టును ఓడించి పెను సంచలనం నమోదు చేసింది. దీంతో ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌-2022లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి.
దోహా : ఫిఫా ప్రపంచకప్‌-2022లో సంచలనాలు నమోదువుతున్నాయి. సౌదీ అరేబియా జట్టు అర్జెంటీనాపై సంచలన విజయం సాధించిన విషయం మరువక ముందే.. ఆసియా ఖండానికి చెందిన మరోజట్టు జపాన్‌ 4సార్లు టైటిల్‌ విజేత జర్మనీ జట్టుకు చెక్‌ పెట్టింది. బుధవారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో జపాన్‌ జట్టు 2-1 గోల్స్‌ తేడాతో 2014 ఫిఫా టైటిల్‌ విజేత జర్మనీపై సంచలన విజయం సాధించింది. జర్మనీ ఆటగాడు లికారు గుండెగాన్‌ తొలి అర్ధభాగం 33వ నిమిషంలో ఒక గోల్‌ కొట్టడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. అదే ఆధిక్యతను 75 నిమిషాలవరకు కొనసాగించినా.. జపాన్‌కు స్ట్రయికర్‌ రిట్సూ డాన్‌ ఒక గోల్‌ కొట్టడంతో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. అదే ఊపులో జపాన్‌కు చెందిన టకుమ అసానో(83వ ని.) మరో గోల్‌ కొట్టడంతో ఆ జట్టు 2-1 గోల్స్‌ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన జర్మనీ ఆటగాళ్లు జపాన్‌ గోల్‌పోస్ట్‌పై ఎదురు దాడికి దిగారు. నిర్ణీత సమయం ముగిసే సరికి మరో గోల్‌ చేయడంలో విఫలమైన జర్మనీ ఆటగాళ్లు.. 7 నిమిషాల అదనపు సమయంలోనూ గోల్‌ చేయలేకపోయారు. జపాన్‌ డిఫెండర్లు సమర్ధవంతంగా బంతిని గోల్‌పోస్ట్‌కు బయటకు తరలించడంతో జపాన్‌కు విజయం ఖాయమైంది. జర్మనీ జట్టుపై జపాన్‌ గెలుపొందడంతో ఫుట్‌బాల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. జర్మనీ జట్టు 2014లో చివరిసారిగా ఫిఫా టైటిల్‌ను గెలుపొందగా.. దానికి ముందు 1990, 1974, 1954లో మూడుసార్లు టైటిల్‌ను ఫిఫా టైటిల్‌ను కైవసం చేసుకుంది.


ఓలీవియర్‌ రెండు గోల్స్‌..  ఫ్రాన్స్‌ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

Olivier Giroud_france


డిఫెండింగ్‌ ఛాంపియన్‌, రెండుసార్లు ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ విజేత ఫ్రాన్స్‌ జట్టు 4-1 గోల్స్‌ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. గ్రూప్‌-డి లీగ్‌ పోటీలో భాగంగా అల్‌ జనాబ్‌ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు ఓలివియర్‌ గిరోడ్‌ 2గోల్స్‌తో మెరిసాడు. ఎసి మిలాన్‌ స్ట్రయిర్‌ బాలన్‌ డి ఓర్‌, కరీమ్‌ బెంజెమా ఒలివియర్‌ సహకారంతో ఓలివియర్‌ ఈ గోల్స్‌ చేశాడు. 19ఏళ్ల ఫ్రాన్స్‌ యువ ఆటగాడు కైలియన్‌ మాపే ఒక గోల్‌ కొట్టగా.. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు మరో గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ తిరుగులేని 4-1 గోల్స్‌ ఆధిక్యతను సంపాదించింది. మ్యాచ్‌ ప్రారంభమైన 9వ నిమిషంలోనే ఆస్ట్రేలియా తరఫున క్రెగ్‌ గుడ్‌విన్‌ ఒక గోల్‌ కొట్టడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌ ఆటగాడు ఆడ్రియన్‌ రాబర్ట్‌ 27వ నిమిషంలో ఓ గోల్‌ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఓలివియర్‌ గిరోడ్‌ రెండు, కైలియన్‌ మాపే ఒక గోల్‌ కొట్టడంతో ఫ్రాన్స్‌ జట్టు తిరుగులేని 4-1 ఆధిక్యతతో మ్యాచ్‌ను ముగించింది.
పోలండ్‌-మెక్సికో, మొరాకో, క్రొయేషియా మ్యాచ్‌లు డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం గ్రూప్‌-సిలో మెక్సికో-పోలండ్‌ల జట్ల మధ్య, గ్రూప్‌-ఎఫ్‌లో మొరాకో-క్రొయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. నిర్ణీత సమయం పూర్తయ్యే సమయానికి ఏ జట్టూ ఒక్క గోల్‌ కూడా నమోదు చేయకపోవడంతో 0-0తో ఈ రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో నాలుగుజట్లకు ఒక్కో పాయింట్‌ దక్కాయి.
ఫిఫా ప్రపంచకప్‌లో నేడు..
గ్రూప్‌-జి: స్విట్జర్లాండ్‌ × కామరూన్‌(మ.3.30గం||లకు)
గ్రూప్‌-హెచ్‌: ఉరుగ్వే × ద.కొరియా(రా.6.30గం||లకు)
పోర్చుగల్‌ × ఘనా(రా.9.30గం||లకు)
గ్రూప్‌-జి: బ్రెజిల్‌ × సెర్బియ(రా.12.30గం||లకు)