Aug 16,2022 07:03
  • 9లోపు హాజరుకాకపోతే గైర్హాజరే
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు స్థానంలో పాఠశాల విద్యాశాఖ ముఖ హాజరు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) యాప్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమెటిక్‌గా ఉపాధ్యాయులకు సెలవుగా పడనుంది. ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్‌ఫోన్ల నుంచే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నూతన విధానం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. ఉపాధ్యాయులు 'సిమ్స్‌ ఎపి' అనే మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు కచ్చితంగా వారి హాజరు నమోదు చేయాలి. 9కి ఒక్క నిమిషం దాటినా సెలవుగా పరిగణించనున్నారు. విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ యాప్‌పై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించని ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారని, వీరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మొత్తం 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటి వరకు 25 వేల మందే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం. నిర్ణీత సమయంలోనే పాఠశాలకు వచ్చిన తరువాత నెట్‌వర్క్‌ పనిచేయకపోతే బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పరిస్థితి వస్తే పాఠశాలను మూసివేస్తారా? అని నిలదీస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారాన్ని విద్యాశాఖ ఇవ్వలేదు. గతంలో బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టిన సమయంలో పరికరాలను విద్యాశాఖ అందించింది. ఇప్పుడు అవసరమైన పరికరాలను ఇవ్వకుండానే ఉపాధ్యాయుల ఫోన్ల ద్వారా హాజరు నమోదు చేయాలని చెబుతోంది.
అందరికీ ఒకే యాప్‌
ఇప్పటి వరకూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరికీ ఒకే యాప్‌ 'సిమ్స్‌-ఎపి'ని తీసుకొచ్చింది. విద్యార్థులకు కూడా అదే యాప్‌ నుంచి హాజరు వేయాలని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యార్థుల పేర్లను యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఎవరి పాఠశాల ఆవరణలో వారికి హాజరును ముందుగా రికార్డు చేయాలి.
అయితే ఇటీవల విలీనమైన చోట్ల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లారు. రికార్డుల్లో మాత్రం పాత పాఠశాలనే చూపిస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ హాజరు నమోదు చేయాలనే దానిపై స్పష్టత లేదు. విద్యార్థుల హాజరుకు ఇప్పటి వరకూ 10:30 గంటల వరకు సమయం ఉండగా, ఇప్పుడు దానిని 10 గంటలకే కుదించారు. విలీన పాఠశాలల్లో టీచర్ల హాజరు తీవ్ర గందరగోళంగా మారిందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మన్నం శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాలలు మారిన ఉపాధ్యాయుల లాగిన్‌లో పాత పాఠశాలల విద్యార్థుల వివరాలే చూపిస్తున్నాయని చెప్పారు. హాజరు విషయంలో నిర్బంధం తగదని ఎపిటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి తెలిపారు. ఉపాధ్యాయులను యాప్‌లు నింపే పని నుంచి తప్పించి బోధనకు పరిమితం చేయాలని కోరారు. టీచర్‌ అటెండెన్స్‌ యాప్‌ను వ్యక్తిగత మొబైల్‌ నుంచి ఆపరేట్‌ చేయాలనడం సరికాదని పేర్కొన్నారు. హాజరు విధానాన్ని రద్దు చేయాలని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నరహరి, ఎన్‌వి రమణయ్య కోరారు. ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం వినియోగించే సెల్‌లో హాజరు వేయాలని నిర్బంధంగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు.
బోధనేతర పనులు అప్పగించొద్దు : ఎన్‌ వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు
ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించబోమని, బోధనకే పరిమితం చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. యాప్‌లతోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఇప్పటికీ 12 యాప్‌లు ఉన్నాయి. గతంలో పరికరాలు ఇచ్చి యాప్‌ల పనిచేయించుకున్నారు. ఇందుకు భిన్నంగా ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై అన్ని సంఘాలతో చర్చించి పున:పరిశీలించి కార్యాచరణలోకి వెళ్తాం.