Dec 08,2022 21:43

ప్రజాశక్తి - ముద్దనూరు : అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లా ముద్దనూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలూరు గ్రామానికి చెందిన రైతు కాతా రామిరెడ్డి(65) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో మిరప, చిక్కుడు, వంకాయ సాగు చేసేవారు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో తనుకున్న భూమి అమ్మి కొంత వరకు అప్పులు చెల్లించారు. ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో గ్రామ సమీపంలో ఉన్న కంకర మిషన్‌ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని భార్య లక్ష్మి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.