Oct 01,2022 15:05

ప్రజాశక్తి -టీ.నర్సాపురం (ఏలూరు) : తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులు నిర్వహించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నపు వారి గూడెం, వెంకటాపురం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైవే పనులను జరగకుండా అడ్డుకున్నారు. పరిహారం పెంచాలని, సర్వీస్‌ రోడ్లు వేయాలంటూ నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆర్బిట్రేషన్ల విచారణ పూర్తి చేసి ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్వీస్‌ రోడ్లుగా బిటి రోడ్లు నిర్మాణం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుండా హైవే పనులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెదుళ్ళ నాగేశ్వరరావు, దుగ్గిరాల నాని, యల్లిన హరిబాబు, పారేపల్లి సత్యనారాయణ, పారేపల్లి వెంకటరామయ్య, ఉద్దాని నరేష్‌, వడ్డపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.