Aug 10,2022 11:32

మదనపల్లె రూరల్‌ (చిత్తూరు) : టమోటా రైతులను ఆదుకోవాలని కోరుతూ ... ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ముందు బుధవారం రైతన్నలు ధర్నా నిర్వహించారు. మదనపల్లె మార్కెట్‌ యార్డులో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో రైతులను ఆదుకోవాలని, టమోటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ప్రభుత్వమే టమోటాలను కొనుగోలు చేయాలని, జాక్‌ పాట్‌ రద్దు చేయాలని, జాక్‌ పాట్‌ అరికట్టాలేని మార్కెట్‌ ఛైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో రైతులు ధర్నా చేస్తున్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, కార్యాలయం బయటకివచ్చి రైతులకు సమాధానం చెప్పకపోతే కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. తమ చేతిలో ఏమీ లేదంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించలేకపోతే ఉద్యోగాలు ఎందుకంటూ రాజీనామా చేసి వెళ్ళిపొండి అని డిమాండ్‌ చేశారు. కార్యాలయంలో నుంచి వచ్చిన అధికారికి వినతిపత్రాన్ని ఇచ్చి వెంటనే తమ సమస్యలను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున దీనిపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మండి యజమానులు ఇష్టమొచ్చినట్టు జాక్‌ పాట్‌ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులంతా వాపోయారు. కనీసం మార్కెట్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని రైతులు వాపోయారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ... మదనపల్లె పేరు చెబితే గుర్తు వచ్చేది మదనపల్లె మార్కెట్‌ యార్డు, టమోటా పంటని, ఆసియాలోనే పెద్ద మార్కెట్‌ గా పేరు సంపాదించిందని వివరించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా టమోటా రైతుల పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసే టమోటాకు ఏడాదిలో నెలరోజులు కూడా మంచి ధర లభించడం లేదని, టమోటా పంట మీదనే ఆధారపడిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. ధరలు పెరిగినప్పుడు ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో టమోటాలను కొనుగోలు చేసే ప్రభుత్వం.. ధరలు పతనమై రైతులకు నష్టం వస్తున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మార్కెట్‌ సిండికేట్‌ కారణంగా ధరలు పతనం అవ్వడమే కాకుండా జాక్‌ పాట్‌ విధానం వలన రైతులు మరింత దోపిడీకి గురవుతున్నారని అన్నారు. యధేచ్ఛగా జాక్‌ పాట్‌, కమిషన్‌ పేరుతో మండీ యజమానులు దోపిడీ చేయడమే కాకుండా పాడిన ధరను కూడా చెల్లించకుండా, చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న మార్కెట్‌ ఛైర్మన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ అధికారులు స్పందించకపోతే మార్కెట్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అద్యకులు శ్యామ సుందర్‌, నాయకులు ఈశ్వర్‌ నాయుడు, మల్లికార్జున, నరశింహులు, ప్రభాకర్‌ రెడ్డి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.