
- దీక్షా శిబిరాల్లో నల్లబెలూన్లు, నోటికి నల్లరిబ్బన్లతో రైతుల నిరసన
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అమరావతి రాజధానిలో సెంటు స్థలం సెగలు చల్లారడంలేదు. రాజధానిలోని ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో రైతులు తమ దీక్షా శిబిరాల్లో నల్లబెలూన్లు ఎగురవేసి శుక్రవారం తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు వెంకటపాలెం రావడానిు పురస్కరించుకుని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) నిరసనలకుపిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు, మందడం, వెలగపూడిలోనిదీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు కళ్ళకునల్ల రిబ్బన్లు కట్టుకొనినిరసన తెలిపారు. రాజధాని గ్రామాల్లో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు, బెలున్లు కట్టారు. ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం నుంచి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వరకు రైతులు ప్రదర్శన చేశారు. మోకాళ్లపై నిలబడి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం వద్ద అసైన్డ్ రైతు పులి చినాు, మరికొందరు రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మందడంలో రైతులు మెడకు ఉరితాళ్లను తగిలించుకొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తుళ్లూరులో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో శిబిరానికి వచ్చిన రైతులు, మహిళలు కళ్ళకునల్ల రిబ్బన్లు కట్టుకొని'గో బ్యాక్ సిఎం' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్రమ ఆర్ 5 జోన్‌ను రద్దు చేయాలని, సెంటు స్థలం పేరుతో పేదలను మోసం చేయొద్దంటూ సిఎంకువ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను రోడ్డుపైకి రానీయకుండా పోలీసులు తాళ్లను అడ్డుగా పెట్టారు.
- వైసిపి కార్యకర్తపై దాడి
వెంకటపాలెంలో సిఎం సభ ముగిశాక బస్సులు, ఇతర వాహనాలు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం ముందు నుంచి తిరిగి వెళుతును సమయంలో ఉద్రిక్తత నెలకొంది. వాహనాలలో వెళుతును వాళ్ళు రైతులను చూసి జై జగన్ అనడం.. రైతులు జై అమరావతి అంటూ సిఎంకువ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ దశలో రైతులు, మహిళలు దీక్షా శిబిరం నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చి బైఠాయించారు. బెలూన్లు ఎగురవేశారు. మేడికొండూరు గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త లాం చినరాయప్ప సిఎం సభ నుంచి వస్తూ జై జగన్ అనడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ఆయనపై దాడి చేశారు. తాను మద్యం తాగానని, తప్పయ్యిందనిచెప్పినా రైతులు శాంతించకపోవడంతో పోలీసులు అతడిని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం విడుదల చేశారు.