Mar 21,2023 11:34

టి.నర్సాపురం (ఏలూరు) : అకాల వర్షాల కారణంగా నాశనమైన పంటలను... టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తుమ్మల సత్యనారాయణ మాట్లాడుతూ ... అకాల వల్ల మొక్కజన్న, అరటి, చేతికొచ్చిన పంట, నిమ్మ, జీడిమామిడి పడిపోయి రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికే విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు, డీజిల్‌ ధరలు పెరిగి, పెట్టుబడులు పెరిగి కౌలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. దీనికితోడు మోటర్లు, మీటర్లు పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరితాడు వేస్తూ ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుందన్నారు. వీటన్నిటికితోడు విరిగిన వేలు మీద తాటికాయ పడిన చందంగా అకాల వర్షాల వల్ల పంటలు పాడై రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట రైతులు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావుపేట శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.