Jan 24,2023 08:26

పిల్లలు ! జె. ఇ. గోర్డన్‌ ఆధునిక బయోమెకానిక్స్‌, పదార్థ విజ్ఞాన రంగాల పితామహుల్లో ఒకరు. మరి ఈరోజు ఆయన గురించి తెలుసుకుందామా !

1913లో యూరప్‌లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుంచి నేవల్‌ ఆర్కిటెక్చర్‌లో పట్టా పుచ్చుకున్నారు. స్కాట్లాండ్‌ షిప్‌ యార్డ్‌లో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడల్లో ప్రయాణించి వాటి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. సరైన పదార్థం సరైన నిర్మాణం ఈ రెండూ కలిస్తేనే మన ప్రయోజనం కోరుకున్న విధంగా నెరవేరుతుందని తెలుసుకున్నారు.
        గోర్డన్‌ అభిరుచులు ఇంజినీరింగ్‌ రంగానికే పరిమితం కాలేదు. సాహిత్య, కళా రంగాల్లో కూడా ఆసక్తి చూపించేవారు. సాంప్రదాయక సాహిత్యంలోనూ మంచి ప్రవేశం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ నౌకాదళంలో పని చేసిన ఈయన, రాత్రిళ్లు తీరిక వేళల్లో అధ్యయనం చేసి గ్రీకు భాష నేర్చుకున్నారు. దాంతో ప్రాచీన సంస్కృతి పట్ల పట్టు సాధించారు.
       మానవ చరిత్రలో పదార్థాలకి ప్రబలమైన పాత్ర వుందని, కొత్త పదార్థాల ఆవిష్కరణ వల్ల చరిత్ర ఎన్నో ముఖ్యమైన మలుపులు తిరిగిందని ఆయన గుర్తించారు. పదార్థాలకి, ప్రాచీన సంస్కతులకి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి పుస్తకాలు రచించారు. గోర్డన్‌ తన అనుభవాన్ని ఉపయోగించి నౌకా నిర్మాణంలో వాడే పదార్థాలని విమానాల రుపకల్పనలో వినియోగించి ఎన్నో చక్కని ఫలితాలు సాధించారు.
 

                                                               ప్రొ. గోర్డన్‌ రాసిన రెండు పుస్తకాలు

1.Structures or Why things dont fall down.
2. The New Science of Strong Materials or Why You Dont Fall Through the Floor

ఇవి అప్పటి కాలంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. లోతైన వైజ్ఞానిక విషయాలని చర్చిస్తున్నా ఈ పుస్తకాలు భారంగా పాఠ్య పుస్తకాలలా కాకుండా సరదాగా చందమామ కథల్లా సాగిపోతాయి. గ్రీకు వీరుడు ఒడిసెస్‌ వాడిన వింటికి నారిని సంధించడం ఎందుకంత కష్టం?, ప్రాచీన గ్రీకులు రాత్రి వేళల్లో రధ చక్రాలని ఎందుకు ఊడదీసి పెట్టేవారు?, గ్రీకుల కాటపల్ట్‌ ఎలా పని చేస్తుంది?, పార్థెనాన్‌ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది? వంటి విస్మయం గొలిపే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గోర్డన్‌ పుస్తకాలలో అందంగా రచయించారు.
ఇంగ్లండ్‌కి, ప్రపంచ పదార్థ వైజ్ఞానిక రంగానికి ఈయన చేసిన సేవలకి రాయల్‌ ఎయిరోనాటిక్స్‌ సొసైటీ రజత పతకం ఇచ్చి సత్కరించింది.