Jun 19,2022 14:25

ముంబయి: యుక్త వయసులో చదువుకుందామంటే కుటుంబ బాధ్యతలు మీదపడటంతో చదువును మద్యలోనే ఆపేయ్యాల్సి వచ్చింది.చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికి కుటుంబ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి చదువుకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. యుక్త వయసులో చదువుకునే అవకాశం లేక ఏడో తరగతి తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడంతో భాస్కర్‌ చదువు మానేశాడు. 30 ఏళ్ల తర్వాత తిరిగి తన కొడుకుతో కలిసి ఈ ఏడాది పది పరీక్షలకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన భాస్కర్‌ వాగ్‌మారే(43) తన కొడుకుతో కలిసి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశారు. ఆ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలు చూసిన కుటుంబ సభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే భాస్కర్‌ పరీక్షల్లో పాస్‌ కాగా.. అతని కొడుకు మాత్రం తప్పాడు.
''పెద్ద చదువులు చదువుకోవాలని నాకు ముందు నుంచీ ఉండేది. కానీ, కుటుంబ బాధ్యతల వల్ల ముందుకు సాగలేకపోయా. కొద్దికాలం నుంచి తిరిగి చదువుకోవాలని అనిపించింది. కొన్ని కోర్సులు చేయడం వల్ల మరింత సంపాదించొచ్చనే ఆలోచన వచ్చింది. అందుకే పదో తరగతి పరీక్షలు రాయాలని నిశ్చయించుకున్నా. నా కొడుకు కూడా ఈ ఏడాదే పరీక్షలు రాశాడు. అది నాకు కాస్త సాయంగా ఉండింది'' అని భాస్కర్‌ తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన విధుల నుంచి రాగానే పుస్తకాలు ముందేసుకునేవారు. తాను పాస్‌ అయినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. కొడుకు ఫెయిల్‌ కావడం మాత్రం బాధిస్తోందని తెలిపారు. తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ రాసి పాసయ్యేలా కొడుకుకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈసారి తప్పకుండా అతను పాస్‌ అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.