
- సర్పంచ్ భర్త వేధింపులు ఆపాలని డిప్యూటీ సిఎంను వేడుకోలు
ప్రజాశక్తి - వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : సర్పంచ్ భర్త తనను వేధిస్తున్నాడంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన డిప్యూటీ సిఎం సాక్షిగా బుధవారం చోటు చేసుకుంది. 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామానికి డిప్యూటీ సిఎం నారాయణస్వామి వచ్చారు. ఎంపిటిసి సభ్యులు తోకల మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదంటూ టిడిపి, జనసేన కార్యకర్తలు తమ జెండాలను కరెంట్ స్తంభాలకు కట్టి నిరసన తెలిపారు. వైసిపి కార్యకర్తలు, పోలీసులు అక్కడికి చేరుకునే సరికి వాళ్లు వెనుదిరిగారు. సర్పంచ్ అన్బురాశి భర్త అశోక్ తనపై పెత్తనం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని డిప్యూటీ సిఎం ఎదుటే ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నెమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగ ఉందని వైద్యులు తెలిపారు.