Mar 13,2023 08:26

చైత్ర, వైశాఖ మాసాలు వసంత ఋతువు. ఏడాదిలో వచ్చే ఆరు ఋతువుల్లోనూ మొదటిది. 'ఋతువుల రాణి వసంత ఋతువు' అని అన్నారు మన కవులు. వసంతాన్నే 'ఋతురాజు' అని కూడా కొనియాడారు కొందరు కవులు. నూతన సంవత్సర ఆహ్వానాన్ని మానవాళి చేత అందుకునే సౌభాగ్యశాలిని. ఏది ఏమైనా కొత్త సంవత్సరానికి స్వాగత ద్వారం వసంతం. ప్రముఖ అభ్యుదయ కవి 'సీరపాణి' జీవన వసంతం అనే కవిత ద్వారా మానవ జీవితంలోకి వసంతాన్ని ఇలా ఆహ్వానిస్తున్నారు.
'శిశిర హిమ యవనికలు శీర్ణమై, జీర్ణమై
నవ మధూదయ స్వర్ణరాగ సంకీర్ణమై
గలిత పాదప శుష్క పత్ర సంరంభమై
లలిత నవ వల్లికా పల్లవారంభమై
అంతరించెను గతము ప్రళయ సంకేతమై
అవతరించెను నవత ప్రణవ సంగీతమై' అనే చరణాల్లో కవి 'నవత' ఎలా ఆవిర్భవించిందో చెబుతున్నారు. శిశిర ఋతువులోని మంచు తెరలు శిథిలమై, కనుమరుగై మధూదయాన్ని సూచించే స్వర్ణకాంతులు దట్టంగా వ్యాపించాయి. పండుటాకులను గలగలా రాల్చివేసి, చెట్లు, లతలు కొంగొత్త చిగురుటాకులతో శోభిల్లుతున్నాయి. ప్రళయ సంకేతంగా గతం అంతరించిపోయి, నిత్య నూతనమైన సృష్టిగా నవత అవతరిస్తోందట.
ఈ సందర్భంగా కవి కాలం యొక్క స్వరూప స్వభావాలను దిజ్మాత్రంగా సూచిస్తున్నారు.
'కాలమొక నిత్య నూతన ఇంద్రజాలం
సుఖ దుఃఖ సంకలిత మణి ప్రవాళం
కాలమొక గంభీర జలధి, నిర్వేలం
రాత్రిందివాల రంగుల ప్రకృతి చేలం'
కళ్ళముందు కదలాడుతున్నా 'కాలం' నిత్య నూతన ఇంద్రజాలం వంటిదనీ, సుఖదుఃఖాలనే మణులు, పగడాలు కలగలిపి కూర్చిన హారం వంటిదని వర్ణిస్తారు. కాలమనేది లోతు తెలియని, గట్టు లేని సముద్రం వంటిది. రాత్రింబవళ్ళనే వెలుగునీడల రంగుల వస్త్రం ఆచ్ఛాదనగా కలిగినదనీ, దాని బాహిర రూపాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఊహకందని కాలం గురించి ఇలా నిర్వచించగలగడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇది కవి రచనా చమత్క ృతికి నిదర్శనం.
'కాలమొక సింధువు, బ్రతుకొక్క బిందువు
కాలమొక మేరువు, జీవితము రేణువు
ఈ ఇరుకు బ్రతుకులో ఇంత క్రౌర్యమ్మా
మానవత్వం మాపునంత ధైర్యమ్మా' అని మానవ జీవితం ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనదో కవి తెలియజేస్తున్నారు. అత్యంత అల్పకాలికమైన బతుకులో ఇంత క్రూరత్వమా! మానవత్వాన్నే మంటగలిపేటంతటి సాహసమా! అని మనిషిలోని అమానుషత్వాన్ని తీవ్రంగా గర్హిస్తున్నారు కవి.
'మనుషులను ప్రేమించు వాడెపో నరుడు
అది ఎరుంగనివాడు అవని యమకింకరుడు' ఇలా సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్తున్నాడు ఈ కవన ప్రేమికుడు. ఇంకా ఇలా అంటున్నాడు ..:
'ఒక హిమాలయ భూధరోత్తుంగ శృంగమై
ఒక క్షీర సాగరోచ్చరదురు తరంగమై
సౌజన్య సౌహార్ధముల నాట్య రంగమై
ప్రతి మనిషి జీవితం పరిఢవిల్లాలి' ఇలా చైతన్యంగా ఉండాలని అంటూ ప్రతి మనిషి జీవితం ఒక హిమాలయ పర్వత శిఖరంలా ఉన్నతంగా ఎదగాలి. ఒక పాలసముద్రం నుండి ఎగసిపడే కెరటంలా సౌజన్యము, సౌహార్ధము అనే సుగుణాలు నటించే నాట్య రంగంలా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నారు.
'యుగయుగమ్ముల ధ్వాంత పటలి నశియింపగా
జడ జగతిలో నూత్న తేజమ్ము నింపగా
నైరాశ్యమును కూల్చి, దారిద్య్రమును డుల్చి
బ్రతుకులో చైతన్య మురళి రవళింపగా' అనే చరణాల్లో తరతరాలుగా మానవజాతిని కమ్ముకొని వస్తున్న అజ్ఞానము, అసమానత్వము అనే దట్టమైన చీకట్లు చెల్లాచెదురు కాగా, స్తబ్దమైన ప్రపంచ గమనంలో కొత్త కాంతులు నింపుతూ, నిరాశను మరియు పేదరికంను పటాపంచలు చేసి, జీవితాల్లో చైతన్య మురళీ రవాలు నినదించేటట్లుగా నవవసంతం జగతికి రాబోతోందని కవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'అరుణ కిసలయ వసన మల్లికా దరహసన
పిక రసన నవవసంతం జగతి కరుదించె
జీవన రసాల శాఖాభ్యంతరము నుండి
అభ్యుదయ పుంస్కోకిలోద్గీతి నినదించె'
ఆగామి వసంతం అరుణారుణ పల్లవాలతోను, మల్లికల దరహాసంతోను వస్తోందట. ఆ శుభా గమనాన్ని కవి ఇంకా ఇలా వర్ణిస్తున్నారు. జీవితమనే మామిడి చెట్టు కొమ్మలమాటున దాగి అభ్యుదయం అనే పుంస్కోకిల గీతాలాపన ద్వారా ఎలుగెత్తి చాటుతోందట.
వసంతాగమనాన్ని ఆసరా చేసుకుని కవి ఈ గేయంలో దగ్గోచరం కాని కాలం యొక్క స్వరూప స్వభావాలను ఒడిసి పట్టి మనకు చూపిస్తారు. సుదీర్ఘమైన కాలగమనంలో మానవ జీవితం ఎంత స్వల్పమైనదో నిర్వచిస్తారు కూడా. ఇంకా మనిషి స్థానాన్ని ఎరుకు పరుస్తారు. ఈ విషయాన్ని గుర్తించి మనిషి దానవత్వాన్ని విడిచి పెట్టాలంటారు. ఇంకా మనిషి ఎంత ఉదాత్తంగా తన జీవితాన్ని ఉన్నత ఆశయాల వైపు పయనింపజేయాలో కూడా సూచిస్తున్నారు. ఈ గేయం ఆసాంతం పఠిస్తే, నిండుగాను గంభీరంగాను ఉంటుంది. అయితే ఈ కవిత సామాన్య పాఠకులకు అర్థం చేసుకోవడం కొంత కష్టం కావచ్చు. ఈ విషయం సీరపాణి గారి వద్ద ప్రస్తావిస్తే, ఆయన సమాధానం ఇలా ఉంది. 'మన కావ్యాల్లోనూ, ప్రబంధాల్లోనూ ఉన్న భాషా ప్రౌఢిమ, భావగాంభీర్యమూ గేయ కవిత్వంలో కూడా చూపించవచ్చును అనేందుకు నిదర్శనంగా నా గేయ రచన ప్రారంభ దశలో ఈ గేయాన్ని ఈ శైలిలో రాశాను'.
ఈ గేయం సీరపాణి గారి 'డమరుధ్వని' అనే కవితా సంపుటి లోనిది. దీన్ని 1972 ఫిబ్రవరిలో రచించారు. ఈ గేయానికి 50 వసంతాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ వంశీ ఆర్ట్స్‌ వారు 1975లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవిత్వపు పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందింది ఈ కవిత. ఈ పోటీకి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కవిత రాసే కాలానికి సీరపాణి వయస్సు సుమారు 22 సంవత్సరాలు. నవ యౌవనంలో నవనవోన్మషంగా అందించిన నవ్య కవితగా ఈ గేయకైతను అభివర్ణించవచ్చు. ఇలాంటి అద్భుత గేయాలను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరముంది.
 

- పిల్లా తిరుపతిరావు
70951 84846