
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, టిడిపి నేతలు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీగా రామగోపాల్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఆయనకు ధ్రువీకరణపత్రం అందకపోవడంపై టిడిపి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న అర్థరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. పలువురు టిడిపి నేతలు అరెస్టయ్యారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ చేతులమీదుగా డిక్లరేషన్ ఫారంను భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అందుకున్నారు.
నిన్న అర్థరాత్రి నుండి కొనసాగిన టిడిపి నిరసన...
ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినప్పటికీ ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించలేదు. దీనిపై టిడిపి నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రామగోపాల్‌రెడ్డికి ధ్రువీకరణపత్రం అందించకపోవడంపై ఆగ్రహించిన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు, తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
సంయుక్త కలెక్టర్ కారు అడ్డగింత ... ఆందోళనకారుల అరెస్ట్
సంయుక్త కలెక్టర్ కేతన్‌గార్గ్ కారును నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు, తదితరులను అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఈసీకి ఫిర్యాదు చేశాం : కాలవ శ్రీనివాసులు
ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ... పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే కాపాడేవారెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. ఈ పరిణామాల తరువాత రామగోపాల్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.