
- తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం
- ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు పేర్కొంటూ ఒక నకిలీ జిఓ జారీ కావడం కలకలం రేపింది. ఆర్థికశాఖ పేరిట ఉండటంతో పాటు, చూడటానికి అసలైన ప్రభుత్వ ఉత్తర్వుల మాదిరే కనపడుతున్న ఈ నకిలీ జిఓ శనివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. దీంతో పభుత్వ ఉద్యోగులతో పాటు, సాధారణ ప్రజానీకంలోనూ భారీ స్థాయిలో చర్చ సాగింది. ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని మరో ఏడాది పెంచే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభత్వుం నుండి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదు. ఏడాది పెంపు ప్రతిపాదనపైనే ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, నిరుద్యోగుల్లోనూ, యువతలోనూ తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 65 సంవత్సరాలకు పెంచారంటూ ఉత్తర్వులు వెలువడటం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకేసారి ఇన్నేళ్లు పెరపు ఏమిటంటూ ఉద్యోగులంతా అవాక్కయ్యారు. సచివాలయంలోనూ తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. 15వ నంబర్‌తో విడుదలైన ఈ జిఓలో పభుత్వ ఉత్తర్వుల్లో ఉండే అన్ని అధికారిక పద ప్రయోగాలు కూడా ఉన్నాయి. దిగువన సంతకం దగ్గర కూడా 'గవర్నర్ తరఫున' అన్నది కూడా స్పష్టంగా ఉండడంతో ఉద్యోగులంతా దీనిని నిజమైన జిఓగానే అయితే ఉత్తర్వులు ఇచ్చిన సమయంలో రిఫరెన్స్‌గా పాత ఉత్తర్వుల వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. తాజా ఉత్తర్వుల్లో ఆ వివరాలు కనిపించలేదు. ఈ నకిలీ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నకిలీ ఉత్తర్వులను తయారు చేసిన వారిని, వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు గుంటూరు జిల్లా డిఐజికి ఫిర్యాదు చేశారు. ఆయన తక్షణ చర్యలకు జిల్లా ఎస్‌పికి ఆదేశాలు జారీ చేశారు. ఇవి పూర్తిగా తప్పుడు ఉత్తర్వులని, వీటిని ఉద్యోగులు, ప్రజలు నమ్మవద్దంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌సిరగ్ రావత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఈ ఉత్తర్వుల కాపీ బయటకు వచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.