May 25,2023 21:52

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ప్రభుత్వ రంగంలోని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని స్టీల్‌ హెచ్‌ఎంఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దొమ్మేటి అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 784వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంటులో ఉత్పత్తి పెంచడానికి వెంటనే కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. ఉత్పత్తిని తగ్గించే విధంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ఐక్యపోరాటాలతో తిప్పికొడతామని స్పష్టం చేశారు. దీక్షల్లో కూర్చున్న వారిలో సీరపు వెంకటరావు, గొందేసి రమణారెడ్డి, గొడ్డి రమణ, పేర్ల అమ్మోరు ఉన్నారు.