Oct 05,2022 07:54
  • 18 నుండి ఎపిలో భారత్‌ జోడో యాత్ర

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైల్‌ పైనే తొలి సంతకమని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ అన్నారు. దిగ్విజరు సింగ్‌తో కలిసి కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైరాం రమేష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర 18న ఎపిలోకి ప్రవేశించనుందని, కర్నూలు జిల్లాలోని ఆలూరు నుంచి మంత్రాలయం మీదుగా ఈ యాత్ర మళ్లీ కర్ణాటక రాష్ట్రంలోని ప్రవేశించనుందని తెలిపారు. ఆలూరు పాదయాత్రలో భారత్‌ జోడో యాత్ర థీమ్‌ సాంగ్‌ను తెలుగులో విడుదల చేయనున్నామన్నారు. ఆర్థిక అసమానత, సామాజిక భేదాలు, ఏకచత్రాధిపత్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర సాగుతోందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు భయపడుతున్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ఎపికి ప్రత్యేక హోదా ఐదేళ్లుఇస్తామని చెబితే, తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని బిజెపి వారు చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దిగ్విజరు సింగ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తింపు లేని సంస్థ అని, దానికి సభ్యత్వమూ లేదని అన్నారు. విభజన రాజకీయం, విధ్వంసం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలని, కుల, మత, ప్రాంత భేదాలతో ప్రజలను విడగొడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, ఇతర ప్రాంతీయ పార్టీలు బిజెపి విధానాలపై పోరాడలేవన్నారు. జోడో యాత్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనను ప్రభావితం చేసిందని, మోహన్‌ భగవత్‌ మదర్సాలను సందర్శిస్తున్నారని తెలిపారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతోందని, ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో ఎపిపిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపిలు పల్లం రాజు, హర్షకుమార్‌, ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి పాల్గొన్నారు.