Jun 30,2022 21:15

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 27వ తేదీ నుంచే ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు జిఓ నెంబరు 58లో పేర్కొన్నారు. శాఖాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అన్ని సంస్థలకూ ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపారు. ఉదయం పది నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఐదు గంటల వరకూ పనిచేస్తున్నారు. శుక్రవారం అయితే మధ్యాహ్నం నుంచి సెక్రటేరియట్‌ దాదాపు ఖాళీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:30 గంటల వరకూ పని చేయాలని పేర్కొన్నారు. జిఓ 58పై సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.