Aug 19,2022 06:41

వరదలకు వ్యాధులకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరదలు వచ్చిన ప్రతిసారీ రకరకాల వ్యాధులు వ్యాపించడం, ప్రభుత్వంతో పాటు, వివిధ సేవా సంస్థలు వైద్య శిబిరాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. దాదాపుగా ప్రతి ఏడాదీ ఈ తరహా పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆపద మొక్కులు తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో బాధిత ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన స్థితి. ఏజెన్సీ ప్రాంతంలో ఈ దుస్థితి మరింత స్పష్టంగా కనపడుతోంది. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. భారీ వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతం నెలరోజులుగా అతలాకుతలమవుతోంది. ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అస్తవ్యస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బురదతో అనేక ప్రాంతాలు నిండిపోయాయి. వరద నీరు నిలిచి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయడం లేదు. వీటికి తోడు మరోసారి ముంచుకొచ్చిన వరద ముంపు! వ్యాధులు విజృంభించడానికి ఇంతకన్నా అనువైన వాతావరణం ఏముంటుంది?
గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో గోదావరికి వరద వచ్చిందని ప్రభుత్వమే ప్రకటించింది. ఫలితంగా గతంలో ఎన్నడూ వరద బారిన పడని ప్రాంతాలు కూడా ముంపులో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు ప్రాంతాల్లో కాంటూరు లెక్కలను మించి వరద వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ విషయాలు అటుంచితే ముంపు కొంత తగ్గి నివాస ప్రాంతాలకు తిరిగి వచ్చిన ప్రజానీకం పెద్దఎత్తున వ్యాధుల బారిన పడింది. విషజ్వరాలతో పాటు అతిసార వంటి వ్యాధులు విజృంభించాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దోమలు పెరగడం, మంచినీరు అందుబాటులో లేకపోవడం ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితులు కొనసాగుతుండగానే మరోసారి గోదావరి విరుచుకుపడుతోంది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతాలు మళ్లీ ముంపు ముప్పును ఎదుర్కుంటున్నాయి. 30 మండలాల్లో ఒకటిన్నర లక్షకు పైగా ప్రజానీకం తాజాగా బాధితులుగా మారినట్టు సమాచారం. వరద ఉధృతి పెరిగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం మళ్లీ రక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా తరలివెళ్తున్న వారిలో అనారోగ్యానికి గురైన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి మరో మార్గం లేదు! రక్షణ శిబిరాల నుండి తిరిగి రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం బాలేని వారిని ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలే అరకొరగా చేసిన ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకోవడంలో చేతులెత్తేసింది.
తొలివిడత వరదల అనంతరం వ్యాధులు వ్యాపిస్తున్నాయన్న వార్తలతో అప్రమత్తమైన నెల్లూరుకు చెందిన డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు చెందిన డాక్టర్ల బృందం విలీన మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించింది. పరిమితమైన వనరులతో నిర్వహించిన ఈ శిబిరాలే బాధిత ప్రజానీకానికి ఎంతో కొంత ఊరట నిచ్చాయి. వైద్యులకు చూపించుకోవడానికి ప్రజలు బారులు తీరడం అక్కడ నెలకొన్న దుస్థితికి నిదర్శనం. అరకొరగా నిధులు కేటాయించడం, అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని పెంచకపోవడం, అవసరమైన మందులను సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పారాసిట్‌మాల్‌ వంటి సాధారణ మందులను కూడా ఇవ్వలేని స్థితి నెలకొనడం బాధాకరం. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం ఈ విషయాలపై దృష్టి సారించాలి. ముంపు ప్రాంతాల ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడంతో పాటు, ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేయాలి. వరద పీడిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. పభుత్వాస్పత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. రాబోయే రెండు మూడు నెలలు వ్యాధులు వ్యాపించే కాలం కాబట్టి అప్పటివరకు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి.