Mar 19,2023 09:16

ఎర్ర జెండాకు వెలుగుల రూపం.. ఆమె జీవితమే ఒక విప్లవ ప్రవాహం.. తెలంగాణ సాయుధ పోరాట యోధ.. తుపాకీ చేతబట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం. అక్షరాలు నేర్వకనే అసెంబ్లీలో ఎరుపు సంతకం చేసిన శక్తి.. 1945, 46లో సాయుధ పోరాటంలో దొరల అహంకారంపై తిరుగుబావుట ఎగరేస్తూ ఉక్కు స్వరాన్ని వినిపించిన విప్లవనారి. నైజాం సర్కార్‌ను గడగడలాడించిన ధీర. తన ఆట, పాట, పోరాటాలతో ప్రజల్ని నిత్యం చైతన్యపరిచిన పోరాటాల దీప్తి. ఆఖరి శ్వాస వరకూ ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. బిగించిన పిడికిలిని సడలించని స్ఫూర్తిప్రదాత.. ఈ నెల 19 ఆ విప్లవనారి మల్లు స్వరాజ్యం తొలి వర్థంతి సందర్భంగా.. శాంతిశ్రీ చేత రాయించిన ఆమె జీవితచరిత్ర 'విప్లవ జనవారథి¸' పుస్తకంలోని కొన్ని ఘట్టాలు సంక్షిప్తంగా ఆమె మాటల్లోనే..

11

మాక్సింగోర్కి 'అమ్మ' నవలలో సోషలిస్టు దేశంలో విప్లవం గురించి చదివాను. విప్లవం అంటే జనం కొరకు, జనం చేత జరుగుతున్న పోరాటం. పోరాటం ఎట్లా వుంటుందో ప్రత్యక్షంగా చూసిన బాల కమ్యూనిస్టుని నేను. అప్పటికి పార్టీ సభ్యత్వం ఏమీ తీసుకోకుండానే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది.
          ఇప్పటికీ గుర్తుకొస్తే.. అట్లా జనాన్ని గుంపులు గుంపులుగా ఇప్పుడు ఎందుకు కదిలించలేకపోతున్నాం అనేది అంతుపట్టదు. దానికి కారణం ఒకటి చెబుతారు ఏమిటంటే, జమిందారీ ఫ్యూడలిజంలో శత్రువు ప్రత్యక్షంగా కనబడతాడు.. కాబట్టి దొరకు వ్యతిరేకంగా అందరూ తిరగబడ్డారు. ఇప్పుడు ప్రత్యక్షంగా దోపిడీదారుడు కనబడడు.. కాబట్టి జనం తిరగబడరని చెబుతారు. కానీ ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సిన సంఘటనలు కూడా సామాజికంగా ఇప్పుడొస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ గురించి కదిలింది జనమే. అందుకే కదిలే వాటిపైనైనా మనం జనాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది.
 

                                                                      చదివింది నాల్గో తరగతే..

మేం ముగ్గురం పిల్లలం. నాకు 13 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చాను. నేను నాల్గవ తరగతి వరకూ చదువుకున్నాను. అవి స్త్రీలకు అక్షరజ్ఞానం అనవసరం అనే రోజులు. నా బాల్యం చాలా హాయిగా జరిగిపోయింది. అదీ కొంచమే గదా! కనీసం 15 సంవత్సరాలు కూడా ఇంట్లో లేను.
       మా నాన్న నాకు హీరో.. నన్ను కూడా హీరో లెక్క చూశాడు. గుర్రం ఎక్కించుకొని తిప్పడం, గుర్రపు స్వారీ నేర్పించాలనడం, వ్యాయామం చేయాలనడం, గురుకుల పాఠశాలకు పంపుతాను. అక్కడ చదువుకోవాలని చెప్పటం వంటివి.
మా నాన్న చనిపోయేటప్పటికి ఆయనకి 40 ఏళ్లు వుండేదేమో! మా అమ్మకు 35 సంవత్సరాలు వుండొచ్చు.

112


 

                                                               అందుకే 'స్వరాజ్యం' అని పేరు..

మా అమ్మ మేనమరిది, మా మేనమావ ఇద్దరూ కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నేను పుట్టినప్పుడు చూడటానికి మా అమ్మమ్మ ఇంటికి వచ్చారట. అప్పుడు 'స్వరాజ్యం నా జన్మహక్కు!' అని ఒక పెద్ద నినాదంతో పాటలు పాడుతూ ఉండేవారు. గాంధీ ఉద్యమం టైంలో పుట్టింది.. 'స్వరాజ్యం' అని పేరు పెట్టు అని చెప్పేవారు. అందుకే 'స్వరాజ్యం' అని పేరు పెట్టింది. మా అమ్మలో అక్షరజ్ఞానం లేకపోయినా.. మానవతావాదం, స్వతంత్ర భావం, హీరోయిజం మెండుగా ఉండేవి.
ఏదో సాహిత్యం, ప్రజాశక్తి, కరపత్రాలు, పుస్తకాలు పట్టుకొచ్చేవాళ్ళు మా మేనబావ వాళ్ళు. మాపై మేనబావ ప్రభావం వుండేది. పత్రికలు తీసుకురావడం అలా చేసేవాడు. ఆయనే మాక్కింగోర్కి 'అమ్మ' పుస్తకం తెచ్చాడు. మాక్సింగోర్కి అమ్మ పుస్తకం చదివాక నా మీద చాలా ప్రభావం చూపింది.
 

                                                           కూలీల కోసం దారికి అడ్డంగా పడుకున్నా..

మొదటిసారి ఆంధ్ర మహాసభ పేరుతో మా ఊరిలో వ్యవసాయ కూలీలతో సమ్మె చేసింది నేనే. మా చిన్నాయన కూలీలను పిలిచి ఇబ్బంది పెడుతుంటే, నేను కూలీలకు వాగ్దానం చేసినా. పొలాలకు పోక తప్పదని అంటే దారికి అడ్డంగా పడుకున్నా. మా అన్నయ్య చెప్పినట్లు చేశా. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు మాత్రమే.
       దేశముఖ్‌లు, పెద్ద భూస్వాముల ఇళ్ళల్లో దేశచరిత్ర, రుద్రమ, ఝాన్సీ పుస్తకాలు ఉండేవి. గోర్కి పుస్తకాన్ని వరసబెట్టి రామాయణంలాగా చదివాను. అది మా అమ్మకు వినిపించాను. రష్యాలో సోషలిజం, రాజకీయాలు మొదట చదివాను. మాక్సింగోర్కి పుస్తకాన్ని అమ్మ తన లైఫ్‌కి అప్లై చేసుకుంది.
        లలితమ్మ భర్త ఆంధ్ర మహాసభ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన ప్రభావం అన్నయ్యపైనా వుంది. దేవులపల్లి వెంకటేశ్వరరావు వచ్చాడు. కమిటీలు వేసుకొని, చర్చించుకుని వ్యవసాయ కూలీ సమ్మె ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నారు. మా అన్న స్పందించాడు.
       మా అన్నయ్య వెట్టికి వ్యతిరేకంగా చట్టం ఉందని, ఆడ కూలీలతో సమ్మె చేయించాలని నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా ఆడవాళ్ళను పిలిపించి మాట్లాడటానికి వీలుకాదు. కాబట్టి నన్ను ప్రవేశపెట్టాడు. పొద్దున్నే వాళ్ళు పనికి పోకముందే వాళ్ళ ఇంటికి పోయి కూడగట్టాలి. మా చిన్న నాయన జీతగాళ్ళతో సమ్మె చేయడానికి పూనుకున్నదని, కుట్ర చేస్తున్నదని, రాజద్రోహం చేస్తున్నదని పోలీసులకు తెలియచేశాడు. ఆ రాత్రే పోలీసులు వచ్చేశారు. అయినా తెల్లారి కూలీల దగ్గరకు పోయా. సమ్మె చేయమని చెప్పా. వాళ్ళు భయపడ్డారు. వామ్మో సమ్మె ఎట్లా చేస్తాం. చెయ్యలేము అన్నారు.
        తెల్లారి హరిజనవాడకు పోయా. అందరికీ చెప్పాను. ఆ మర్నాడూ పోయా. ఎవరూ అంగీకరించడం లేదు. ఏం చేయాలి? మా చిన్నాన్న పొలానికే పోతున్నారు. నేను పోయి వాళ్ళు పోయే డొంకలో అడ్డం కూర్చున్నా. ఇక ముందుకు పోనీయనని. వాళ్ళు నన్ను బతిమాలాడారు. నేను వాళ్ళను బతిమలాడా. నాకు స్పిరిట్‌ వచ్చేసింది. వాళ్ళను పోనీయలేదు. 'లేనిపోని గొడవలు అవుతాయి. లేవమంటారు. నేను లేవను. నన్ను దాటిపోతారా? పొండి. భయమైతే మీరు మీ ఇళ్ళకు పోకుండా అడవుల్లో కట్టెలు కొట్టుకొని, పొద్దుగూకిన తర్వాత ఇళ్ళకి పొండి!' అన్నాను. అది నచ్చింది. ఆ రోజు అలా సమ్మె ఆ రూపంలో జయప్రదమైంది.

333


                                                       తొమ్మిదేళ్ల వయసులో కర్ర ఎత్తి వెంటబడ్డా..

తెల్లారి కూలీలందరినీ పిలిపించి, పెద్ద పంచాయతీ పెట్టారు. మా ఇంట్లో పనికొచ్చే వాళ్ళే ఉరుక్కుంటూ వచ్చి చెప్పారు. దొరసానీ వద్దంటే వినకపోతివి. కొడతారో, ఏమి చేస్తారో, ఏమి బాధలు పెడతారో. మాకు భయమేస్తుంది అన్నారు. మా అమ్మ మనం ఇస్తే సరిపోయే. తర్వాత మిగతా వాళ్ళు ఇస్తారు. సమ్మె చేయాల్సిన అవసరమేమొచ్చింది. అన్నది. ఆ ఉపాయం నాకు ముందు తోచలేదు.
పంచాయతీ పెట్టిన దగ్గరకు ఉరికినా. అది సంచలనం. సమ్మె చేయించమని అన్నయ్య చెప్పాడు అని చెప్పాను. నన్ను కొట్టిన తర్వాత వాళ్ళను కొట్టండి. మేం కూలి పెంచుతాం. మీరు పెంచండి అని చెప్పా.
         బజారుకెళతావా? రాత్రిళ్ళు పోతావా? అక్కడికీ, ఇక్కడికీ. బజారు ఆడవాళ్ళతో వుంటావా? ఇంట్లోకిరా అన్నాడు మా చిన్నాన్న. రాను. ఇంట్లోకి రాను అన్నాను. నామీద దెబ్బపడ్డాకనే వాళ్ళ మీద పడాలి. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళతో అమ్మాయిని ఇట్లా పట్టుకునా. తీసుకొచ్చి ఇంట్లో పడేయ్యి అన్నాడు. నాకు 9 ఏళ్ళు వుంటాయోమో. పనోళ్ళు నన్ను ఇంటిలోకి తీసుకెళ్ళడానికి వస్తే కర్ర ఎత్తి నేనే వెంటబడ్డా. రాను. నేను ఇంట్లోకి రాను. చెప్పిన దానిని నేను. నన్ను ఏం చేయదలచుకుంటారో చెయ్యి అన్నాను. ఇంకో చిన్నాయన వచ్చి మన పిల్లతో గొడవేంటి. మన పరువే పోతుంది అని వదిలెయ్యమన్నాడు. వదిలేశారు. ఇస్తమంటున్నారు కదా. ఏమిస్తారో చూద్దాం అన్నాడు. ఆయన సామ్యవాది. నేను ఊరుకోలేదు. తెల్లారి పొద్దునే వాళ్ళ వాడకు పోయాం. గబగబా పొయ్యి మీద కుండలు కూడా వదిలి నన్ను దొరికిచ్చుకొని వామ్మో ! ఎట్లా కాపాడావు మమ్మల్ని అని అన్నారు.

55


       మా అన్నయ్య అయితే వారం తర్వాత కలిశాడు. నన్ను ఎత్తుకుని ఒకటే అభినందనలు తెలిపాడు. భలే జయప్రదం చేశావని మెచ్చుకున్నాడు. మా ఇంట్లో వడ్లు దంచుతున్నారు. నేను పోటు వేస్తానని రోకలి పట్టుకున్నా. మా అమ్మ తప్పు అని అన్నది. వామ్మో హరిజనులను ముట్టుకున్నారని ఒకటే గోల. వడ్లు దంచేది హరిజనులు. వడ్లు దంచేప్పుడు వాళ్ళు పాటలు పాడేవారు.
ఒకనాడు దంచుతూ, దంచుతూ ఎల్లమ్మ అనే హరిజనుల ఆమె అడ్డంగా పడిపోయింది. నేను పోయి మంచినీళ్ళు తెచ్చి చెంబుతోటే నేను నీళ్ళు తాపుతున్నా. ఆ చెంబును ఇంట్లోకి తేనీయరిహ. కూలి రోజుకు అరకేజి ఇచ్చేవాళ్ళు నూకలు మొత్తం దంచితే. మేము తవెడు, తవెడు పంచినాము. అమ్మకు చెప్పలేదు.
        3వ రోజు వడ్లు దంచడానికి మాకు అడ్డెడు పెడితేనే వస్తాం. లేకపోతే రాము అని చెప్పారు. ఎంత స్పందనో. అదే ఒక వరస ఉద్యమానికి ప్రారంభ చర్య.ౖ నా రాజకీయ జీవితం ప్రారంభమైందీ అప్పుడే అనుకోవచ్చు.

77


 

                                                     ఏ ఊర్లో ఉంటే.. ఆడే తినడం, పడుకోవడం..

వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రచారం జరగాలి విసునూరు ఏరియాలో. సమ్మె చేయాలి. వ్యవసాయ కూలీల సమ్మె జరగాలి. అని పార్టీ నిర్ణయం జరిగింది. ప్రచారం ఎట్లా అంటే అన్నకు ఎవరో చెప్పారు. స్వరాజ్యం అయితే మంచిగా పాటల పాడుతుంది. చిన్న పిల్లలాగ పోతుంది. ఊరంతా కూడుతుంది అని. అంతే...
        అక్కడే మొదలుపెట్టా ఉయ్యాలపాట. పోతున్నకొద్దీ విసునూర్‌ కథలు వినొస్తున్నాయి. దేవరపల్లిలో మర్రివాళ్ళ కుటుంబంతో నేను కొన్ని నెలలు గడిపాను. కొమరయ్య చనిపోయాక 2,3 నెలలు అక్కడే వున్నాను ప్రచారం చేస్తూ. ఏ ఊర్లో వుంటే ఆ ఊర్లోనే తినడం, పడుకోవడం. దొరకు వ్యతిరేకంగా ఉయ్యాల పాట చివరికి తిరగబడండి అనే చరణం వచ్చింది. తిరగబడితే ఈ దొరలు ఉండరురా అని.

778


                                                                        ఆ పాటే ఆయుధం..

అయిలమ్మ పొలం విషయంలో పెద్ద ఉద్యమమే జరిగింది. అయిలమ్మ గ్రామం పాలకుర్తిలో వుండి 8 నుండి 10 రోజులు ఉయ్యాలపాట పాడుకుంటూ ప్రచారం చేశాం. ఉయ్యాలపాట మొదలవ్వగానే జనం అంతా గుమ్ముకూడేవారు ఆడ, మగ చేతుల్లో కర్రలతో. ఆ పాటే ఆయుధం. చీము, నెత్తురు లేదా ఉయ్యాలా, తిరబడవేమిరా ఉయ్యాలా అని పాడితే ఎందుకురా ఈ బతుకు? చిన్న పిల్ల చెబుతుంది ధైర్యంగా తిరగబడదాం పదా అని జై ఆంధ్ర మాతా అంటూ వచ్చేవారు. ఉయ్యాలపాట అందిస్తే చాలు నోట పట్టుకొని వాళ్ళకు వాళ్ళే అల్లుకునేవారు కొన్ని పదాలతో.
బతకమ్మ పాటలో కోల్‌ అని పాడేవారు. కోల్‌ పదం కోలాటం నుండి వచ్చింది. కోలాటం వేసుకుంటూ అది పాడేవారు.

889


మామూలు ఆడవాళ్ళు తమ కష్టాన్ని ఒడ్లు దంచేప్పుడు అట్లాంటి పదాలు పెట్టి పాడేవారు.
ఒకా ఒక్క ఇప్పు గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
వంద ఆవులు మేసేనయ్యా గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
నీ పొట్ట మీద పాలసారిక గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
పాలబుడ్డి నెత్తి నుండి గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
పసిపోయిడు ఏడుస్తున్నడు గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
దోసెడన్ని పాలుబొయ్యి గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా
ఆవుల మందలు తోలుకొని గొల్లలు అడవికి పోయేవారు. అడవిలో ఈ పాట పాడేవారు. ఆవుల మందలు కాసే గొర్రెవాళ్ళంతా మన ఆర్గనైజర్లే. గిరిజన ప్రజలకు వార్తలు అందించడం, ఉద్యమాలు చేయడం, జనంలోకి ఒక ఉద్యమాన్ని తీసుకుపోవడం. జానపద గేయాలు అది వరకే వాళ్ళకుండేది కాబట్టి అందిస్తే అల్లుకుపోయేవారు.
విచిత్రమేమిటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కాల్చేయబడ్డవారి భార్యలు, తల్లులు, ఊరు ఊరంతా ఉయ్యాలపాట పాడి ఓట్లు వేయమని ప్రచారం చేశారు.
అడవుల్లోకి మనవాళ్ళు పాండవులు పోయినట్లు వనవాసం పోయారు.
కౌరవుల రాజ్యాల ఉయ్యాలా
కష్టాలు వచ్చెనే ఉయ్యాలా
దొరల తరిమినోళ్ళు ఉయ్యాలా
సంఘపు దేవుళ్ళు ఉయ్యాలా
వీరమాతలు గన్న ఉయ్యాలా
భూదేవమ్మ ఉయ్యాలా
మా బిడ్డలను వీరు ఉయ్యాలా
రక్షించి పంపారు ఉయ్యాలా
వెయ్యండి మీ ఓటు ఉయ్యాలా
సుత్తీకొడవలిచూసి ఉయ్యాలా
వెయ్యండి మీ ఓటు ఉయ్యాలా
సుత్తీకొడవలిచూసి ఉయ్యాలా
మన దేవతలు ఉయ్యాలా
మన దేవుళ్ళు ఉయ్యాలా
కాంగ్రెస్‌ పెట్టెల్లో ఉయ్యాలా
చెప్పులు పారేసి ఉయ్యాలా
రజాకార్ల తరిమిన ఉయ్యాలా అంటూ ఊరు ఊరంతా పాడి ఆ పెట్టెల్లో చెప్పులేశారు.
అంత కసి. అట్లాంటి సంఘటనలు చూశాక ఏ కమ్యూనిస్టు మడిమ తిప్పి వెనక్కిపోతాడు? ఎవడు ఎక్కడికి పోతాడు? జనం కోసం, జనంచేత, జనమే పాత్ర తీసుకుని చేసిన ఉద్యమాన్ని వదలగలమా? వదలలేము. ఎవరైతే దేశం కోసం, పేదల కోసం బయలుదేరామని అనుకుంటారో వాళ్ళు వెనక్కి మళ్ళరు. నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చారు.

99                                                                  అట్లా ఉపన్యాసకురాలినయ్యా...

నా మారుపేరు రాజక్క. గ్రామ పరిపాలన సందర్భంగా సామాజిక సమస్యల ఎడల తీసుకున్న వైఖరిలో 'ఎక్కువ మందిని పెళ్ళి చేసుకోవటం, బాల్య వివాహాలు చెయ్యటం కూడదు' అని మన పార్టీ ప్రచారం చెయ్యాలని అనుకున్నాము.
      ఒకటి, రెండు కేసుల్లో మీరు వెళ్ళిపోండి. ఎవరేమంటే మాత్రమేమి. వినిపించుకో నవసరం లేదని చెప్పాము. వెంటనే పార్టీకి కంప్లయింట్‌. స్వరాజ్యం పుస్తెలు తెంపుకుంటూ పోతోంది అని, పార్టీ వాళ్ళు నన్ను మందలించారు. ఇదేమి పని ఉద్యమానికి నష్టం జరుగుతుంది అని.
కామారెడ్డిగూడెంలో ప్రచారం చేస్తున్న సమయంలో, మళ్ళీ దేవరపల్లి పోదామనుకుంటుండగా కొమరయ్యను కాల్చారు.. చనిపోయాడు.. అనే వార్త అందింది.
       రావి నారాయణరెడ్డి వచ్చాడు. సభ పెట్టినాము. కంప్లయింట్‌ ఇచ్చి లీగల్‌గా పోరాడదాము అని నిర్ణయం. అప్పటి నుండి సభలు, సమీకరణ, అట్లా అట్లా ఒక ఉపన్యాసకురాలినయ్యాను. పాటలు పాడటం, జనం కూడటం, సభ కావటం, సభలో మాట్లాడటం. ఇది పరిణామం.
ఒంటరిగా సభలు లీడ్‌ చేసే స్థితి. ఉపన్యాసం చెప్పటం, ప్రజల్ని సమీకరించే శక్తి పెరిగింది. ప్రజల మన్ననలు పొందాను. వ్యక్తి పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది.
        నాకు చాలా సార్లు గుర్తుకొస్తాయి. మా కోసమే దెబ్బలు తినేవారు. ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అడ్డమేసి మమ్మల్ని కాపాడేవారు. ఎంత హింసించినా మా గురించి చెప్పేవారు కాదు. గొప్ప చైతన్యం. ఆ పోరాటమే గొప్ప స్ఫూర్తిదాయకం.. అట్లాంటి పోరాటాలు చాలా తక్కువ.
ఈ పెళ్లి నిలబడతదా అనుకున్నా..
        దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి క్వార్టర్‌లో బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు పెళ్ళి చేశారు. దండలు వేశారు. అప్పటికీ నాకు లోపల అయోమయంలోనే వున్నాం. అప్పటికి వి.యన్‌. పోరాటం విరమించాలని వున్నారు. నేను వ్యతిరేకంగానే వున్నాను. బయట మితవాదం లైన్‌ వస్తుంది. పోరాటం చేసింది తప్పు అనే సమీక్షలు వస్తున్నాయి. దాని గురించి బాగా ఆందోళనలో వున్నాను. ఈ పెళ్ళి కూడా నిలబడతదా అని అనుకున్నాను.
          ఆరోజు ఎలాంటిదంటే విశాలాంధ్ర మహాసభ జరిగింది. విశాలాంధ్ర నినాదంపై హైదరాబాద్‌లో పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో నేను ఉపన్యాసం ఇచ్చి వచ్చాను. బ్రహ్మాండంగా. ఆ రోజు సాయంత్రం మా పెళ్ళి.
ముగ్గురు పిల్లలు నాకు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. మంచిగనే చదువుకొని సెటిలయిన్రు. పెద్దోడు గౌతమ్‌ గవర్నమెంట్‌ హోమియో డాక్టర్‌, ఇంకొక కొడుకు నాగార్జున్‌. లా చదివిండు. ఆయనిప్పుడు హౌల్‌టైమర్‌గానే ఉన్నడు. ఆడబిడ్డ కరుణ బి.యెస్సీ చదివి ఫీల్డ్‌ ఆఫీసర్‌ అయ్యింది.
నువ్వెట్ల తెల్చినవ్‌.. నువ్వు గెల్చుడేంది.. అన్నారు..
          1978లో ఎం.ఎల్‌.ఎ. అయిన. మీకు ఒక కథ చెప్పాలి. నేను ఎం.ఎల్‌.ఎ.గా గెల్చాక, ఏ పది పదిహేను రోజులకో ప్రమాణ స్వీకారం అన్నారు. నేనేమో ఓట్లయిపోయిన తర్వాత ఇరవై రోజులు నియోజకవర్గంలో అక్కడక్కడా తిరుగుతూ వెళ్తున్నాను.
          అలాగే పోయిన అసెంబ్లీకి. చప్రాసీ నన్ను లోనికి పోనిస్తలేదు. ''ఎందుకు బోనీయరు? ఇది అసెంబ్లీగాదా?'' అని అంటున్న. ''ఇది అసెంబ్లీయేగానీ, గెలిచినోళ్ళే రావాలి ఇందులోకి'' అంటున్నడు. అంతలో నేను చిన్నగ ''నేను గెల్చినగద'' అన్న. ఆయనకి అర్ధంగావడంలేదు. ''నువ్వెట్ల గెల్చినవ్‌, నువ్వు గెల్చుడేంది'' అంటున్నడు బంట్రోతు (నవ్వు). నేను జూస్తే ఎం.ఎల్‌.ఎ. పొజిషన్‌లో లేను. మరి కనీసం ఇస్త్రీ చీర, కొత్త చీర కాకుంటేమాయె. అది గూడ లేదు. ఓంకార్‌ సంతకం పెట్టిండు, వచ్చిండు. ఆయనకి సంతకం బెడుతున్నప్పుడన్నా, కనీసం నేను లేనుగద అన్న ధ్యాసైనా లేదు. బయటకొచ్చి నన్ను చూసి, ''ఓV్‌ా! ఏమనుకున్నవ్‌ ఆమెను. ఆమె మా నాయకురాలు. గెల్చి వచ్చింది. ఏమనుకున్నవ్‌'' అని నన్ను తీసుకోని లోపలికి పోయిండు. అప్పుడు సంకతం బెట్టిన. నాకు ఇంగ్లీషు రాదు. ఎజండా కూడా ఇంగ్లీషులో ఇస్తున్నరు. కొంచెం భయమైంది మొదటిరోజు.

123


                                                                    అక్కడా గెరిల్లా పోరాటమే..

అసెంబ్లీలో వాతావరణం వేరేలా వుండేది. అక్కడా, ఒకరంగా నేను గెరిల్లా పోరాటమే చేశాను. నాతోపాటు ఓంకారున్నాడు. ఓంకార్‌ చట్టపరమైన వాటిని, నా పద్ధతికి తగ్గట్లు ప్రశ్నల రూపంలో ఎట్లడగాలో నాకు చెప్పేవాడు. చట్ట పరిజ్ఞానాన్ని నేర్వడం అన్నది ఒక ఎత్తు.
ఎమ్మెల్యేగా పని చేయటమంటే చట్టపరమైన కొన్ని పరిమితులుంటయి. వాటికి లోబడే అయినా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చెయ్యాలె. దాని కొరకు చొరవ తీసుకొని కొట్లాడటం కమ్యూనిస్టుల కర్తవ్యం.
       నేను ఎం.ఎల్‌.ఎ.గా అయిన ఫస్టు ఫస్టే. రమీజాబీ కేసు పట్టిన. ఈ కేసులో న్యాయం కోసం ఆంధ్రదేశమే స్థంభింపజేసినం. అసెంబ్లీలో నా వాయిస్‌ వినిపిస్తే, చెన్నారెడ్డి ''మాటలు తూటాల లెక్కన ఎక్కుపెడతవ్‌. ఇది బహిరంగ సభేంగాదు. ఎందుకంత ఆవేశపడతవ్‌'' అన్నడు.
లీగల్‌ పద్ధతుల్లో ఎట్లా పోవాలో వి.ఎన్‌.గారు సహాయపడేవారు. అట్లనే ఓంకార్‌ కూడా. అసెంబ్లీలో ఎట్ల పోవాల్నో చెప్పేటోడు. అతను నాకు బాగా సహాయం చేసిండు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడ నా జీవితమంత ప్రజల నడుమనే గడిచింది. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళతోనే ఉండేదాన్ని.
 

778

                                                                         మహిళా ఉద్యమంలో..

మహిళా ఉద్యమంలో అధ్యక్షురాలిగా 1981లో అయిన. 2002లో మహిళా సంఘం అధ్యక్షురాలిగా దిగిపోయిన. ఇరవయి ఏళ్ళు రన్నింగ్‌ ఉద్యమం నడిపిన. నాకైతే ఈ విషయంలో సంతృప్తి బాగానే ఉంది.
       ఓ పది డిమాండ్లు పెట్టి ఉద్యమాలు చేసినం. మహిళా ఉద్యమం చేసి స్త్రీలకి ఆస్తిహక్కు సంపాదించినం. నర్సింగ్‌ స్కూళ్ళు జిల్లాకొకటి కావాలని డిమాండు చేసినం. పాలసీ మేటర్లు, డిమాండ్లు రూపొందించటం, కార్యక్రమాలను రూపొందించటం, జనాన్ని సమీకరించడం నేనే చేసేదాన్ని.
        వ్యవసాయ కూలీ మహిళలు, కార్మిక మహిళలు వీరందరి సమస్యలతో మొదలు ఆర్థిక సమస్యలను పరిష్కరించాలె. వారికి రాజకీయ చైతన్యం ఇవ్వాలి. తరువాత సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి. అంతేగాని, ఒక్క సామాజిక ఉద్యమంగానే, మహిళా ఉద్యమాన్ని ఉంచితే పనికిరాదు. అట్లనే ఒక్క వర్కింగ్‌ ఉమెన్‌ మూవ్‌మెంట్‌ అంటే కూడ పనికిరాదు అన్న. ఒక దశలో నిర్ణయానికి వచ్చిన్రు. ఆ లెక్కనైతే సి.ఐ.టి.యు. ఉమెన్‌ వర్కింగ్‌ ఉమనె. యూనియన్‌ల ద్వారానే వాళ్ళు ఆర్గనైజ్‌ గావాలెకానీ, మహిళా సంఘానికి అది కార్యక్రమంగాదు అని చెప్పేసిన్రు. చెప్పడమంటే చర్చల్లో ఆ జవాబు వచ్చింది. మిడిల్‌ క్లాస్‌ మహిళల సమస్యలని కూడా పట్టించుకోవాలి. కానీ వాళ్ళొక రిజర్వ్‌ ఫోర్స్‌వలె వుండాలి. సమయం వచ్చినప్పుడు మహిళా ఉద్యమానికి ఒక రూపం ఇచ్చేందుకు, బహుళ వర్గాల ఉద్యమంగా అది వుండాలి. ఈ క్వాలిటీ సమస్యను వర్గ దృక్పధంలో భాగంగా పాలసీలో ఇమడ్చాలి. ఆస్థిహక్కు, పనిహక్కు, సాధికారత ఇలాంటి ఆర్ధిక సమస్యలని మనం ముందు లేపి, మధ్యతరగతి మహిళలను స్వతంత్రంగా నిలబెట్టేందుకు కృషి చేయాలి. అలాగే సామాజిక భావజాలానికి అంటే ఫ్యూడల్‌ భావజాలానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో నుండే వ్యతిరేకంగా ప్రచారం, ఊరేగింపులు, పోరాటాలు అన్నీ జరగాలి. ఆ ఫ్యూడల్‌ భావాలను మనం ఎదుర్కోకపోతే, వర్కింగ్‌ ఉమెన్‌ కూడా సఫర్‌ అవుతారు. ఇప్పటికీ స్త్రీలు దెబ్బలు తింటున్నరు. కష్టాలపాలు అవుతున్నారు. విడాకులు దండుగలు కడుతున్నరు.
         ఒక సంగతి చెప్పాలె. తెలంగాణా పోరాటకాలంలో కూడా, మహిళల సమస్యలని పట్టించుకున్నం, పరాపాలనా, పంచ్‌ కమిటీలను ఏసినం. ఆ కమిటీలు ఏసేటప్పుడు వాటిల్లో ఇద్దరు మహిళలను వేయాలని పట్టుబట్టినం మనం. పార్టీ అంగీకరించింది.

555

                                                            తుపాకీ రేంజి కంటే.. వడిశలే ఎక్కువ..

     కడివెండి ఘటన జరిగాక అయిలమ్మ ఘటన. తర్వాత భూమి కోసం పోరాడాలి. భూస్వాములు భూమి మీద కౌలుదారులు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో వాళ్ళని అట్లనే నిలబెట్టి కదలనీయవద్దు. జండాలు పాతాలి. నాగళ్ళు పట్టాలి. ఎవరైనా వస్తే భూస్వాముల గూండాలను వస్తే తరిమికొట్టాలి. ఇది జనానికి ఎట్లా చేరాల. దానికి సంబంధించిన పాటలు రాసుకుంటూ కుదప సంఘాలు మొదలుపెట్టాం. కుదప అంటే ఒడిసాల నడుం కట్టుకుని కర్రలు పట్టుకొని పోవడం. దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ పోవాల.
        అయిలమ్మ భూమి తర్వాత భూమి కోసం, కౌలుదార్లను నిలబెట్టాలని పోరాటం చేశాం. వెట్టి చాకిరి పతనమైనది.
దొడ్డి కొమరయ్యదే మొదటి, చివరి వెట్టి చాకిరీ. సంవత్సరం తిరిగేసరికి మొత్తం తిరుగుబాటు చేసి గ్రామ దళాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని కాపలా కాసుకునే స్టేజ్‌కి తెచ్చింది పార్టీ. పాత సూర్యాపేటలో రాళ్ళకుప్పలు పోస్తున్నారు. వడిశాలతో దాడి మొదలయ్యింది. కంచు టోపీలు పెట్టుకొని మిలట్రీ వాళ్ళు వచ్చారు. ఆ టోపీల మీద వడిశాలతో కొడితే ఠంగు, ఠంగుమని సంగీతం విన్నట్లే మోత వచ్చేది. వీళ్ళు ఒక్కళ్ళు కాదుగదా వందల మంది. అప్పటి తుపాకీ రేంజి కంటే దూరంగా పోయేయి వడిశాలు. అందుకని వెనక వున్న పోలీసులకు, టోపీలకు దెబ్బలు తగిలేవి.
వడిశాల పోరాటం ప్రారంభంలో ఫేమస్‌. రౌడీలను, భూస్వాముల గూండాలను కొట్టడానికి, ఆత్మరక్షణకు తీసుకున్న వడిశాల చివరకు పోలీసుల మీద కూడా ప్రయోగించడానికి పనికొచ్చింది.
జన సమూహం ఎక్కువ మంది వుండి, ఎక్కువ మంది ప్రయోగించేసరికి పోలీసులమీద పెద్ద ప్రభావం పడి వూళ్ళోకి ఎంటర్‌ కాలేని స్థితి. కుదప దళంకన్నా ఎక్కువ వడిశాల దళం ప్రొటెక్షన్‌గా పనికొచ్చింది.
ప్రజలు కూడా అందరూ అందుకొని కొట్టగలిగేవారు. ఈ రెండు దళాలు ఒకదశలో పెద్ద విముక్తి దళాలు.
మగవాళ్ళలో రక్షణ దళాలను ఏర్పాటు చేయమని గ్రామ నాయకత్వానికి అప్పజెప్పారు. ఆడవాళ్ళ గురించి మాకేమీ సూచనలివ్వలేదు. జనాన్ని సమీకరించండి. భూ పంపక కమిటీలో మీరే వుంటే మరి ఆడవాళ్ళు. ఇది పార్టీలో కూడా చర్చ అయినది. దండం అనే పద్ధతి మనం రానీయవద్దు. విడిపోయే నిర్ణయం చేస్తే మళ్ళీ వైరుద్యాలు వస్తాయి. విడిపోయే నిర్ణయం చేయవద్దు అని సంఘంలో వచ్చింది. పోరాటానికి దెబ్బ తగులుతుందనే వాదన వచ్చింది.