
ముంబయి : భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) వరుసగా ఆరోసారి వడ్డీ రేటు బాదుడును కొనసాగించింది. రెపోరేటును మరో పావు శాతం అంటే 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. తాజాగా ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) విధాన సమీక్ష బుధవారం ముగిసింది. తాజా పెంపునతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది మే నుంచి రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా భారత భవిష్యత్ అంచనాలు అస్పష్టంగానే ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ప్రజలు ఇకపై నాణేలు సులభంగా పొందేందుకు వీలుగా ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద 12 నగరాల్లో కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.