Dec 02,2022 08:16
  • గంట ముందు వాట్సాప్‌కు ప్రశ్నాపత్రాలు
     

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థులకు శుక్రవారం నుంచి ఫార్మెటివ్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శుక్ర, శని, సోమవారాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్షను 45 నిమిషాల షెడ్యూల్‌ ప్రకారం జరపాలి. ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటలకు ఒక పరీక్ష, 3.15 నుంచి నాలుగు గంటల వరకు మరో పరీక్ష నిర్వహించాలి. 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 10.15 గంటలకు ఒక పరీక్ష, 11.15 నుంచి 12 గంటలకు మరో పరీక్ష నిర్వహించాలి. గతేడాది నుంచి విద్యాశాఖ వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పంపుతోంది. గతేడాది ఒకరోజు ముందుగా ప్రశ్నాపత్రాన్ని పంపగా ఈసారి కేవలం ఒక గంట ముందు మాత్రమే పంపనుంది. వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయులు బోర్డుపై రాసి విద్యార్థుల చేత పరీక్షలు రాయించాలి.