Jun 02,2023 20:36

ప్రజాశక్తి-కడప అర్బన్‌/పోరుమామిళ్ల :వైఎస్‌ఆర్‌ జిల్లాలో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని, వేర్వేరు చోట్ల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి అన్బురాజన్‌ వెల్లడించారు. తన కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మైదుకూరు లంకమల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. కడపలో ఏడు ఎర్రచందనం దుంగలు, కారు, మోటారు సైకిల్‌, నాలుగు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామంలోని రాచకొండు రామయ్య ఇంటిలో 33 ఎర్రచందనం దుంగలను కడప టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో, దుంగలను స్వాధీనం పరుచుకోడంలో కీలక పాత్ర పోషించిన అదనపు ఎస్‌పి (అడ్మిన్‌) తుషార్‌ డూడి పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ ఎం నాగభూషణ్‌, మైదుకూరు అర్బన్‌ సిఐ చలపతి, ఎస్‌ఐ ఘణ మద్దిలేటి, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బందిని ఎస్‌పి అన్బురాజన్‌ ప్రత్యేకంగా అభినందించారు.