
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాజధానిని, ముఖ్యమంత్రి నివాసాన్ని వైజాగ్‌కు మారుస్తానని జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉపసంహరించుకుందని, హైకోర్టు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ఆదేశించిందని తెలిపారు. హైకోర్టు తీర్పును ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించిందని వివరించారు. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వుందని, ముఖ్యమంత్రి ప్రకటన కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నివాసం మారినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను తప్పుదారి పట్టించడానికి, రియల్ ఎస్టేట్‌లో స్పెక్యులేషన్ పెంచడానికే తోడ్పడుతుందని విమర్శించారు. ఉత్తరాంధ్రకు నిధులిచ్చి అభివృద్ధి చేయకుండా, విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ రాజధాని పేరుతో మోసం చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి జిమ్మిక్కులకు బదులుగా రాజధానిగా అసెంబ్లీలో వైసిపి సహా ఏకగ్రీవ ఆమోదంతో మొదలై ఇప్పటికే ఎంతో డబ్బు వెచ్చించిన అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండు చేశారు.