Aug 06,2022 07:00

జాతీయత , దేశభక్తి గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రచారం, పటాటోపం చూసి ...దేశ స్వాతంత్య్రోద్యమంలో ఈ సంఘీయులు ఘనమైన పాత్ర పోషించి ఉండొచ్చని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టు. ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో ఆవిర్భవించినా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఒక్క ఎన్నదగిన నాయకుడైనా దానికి లేకపోవడం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్ర సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు ఏనాడూ భాగస్వామి కాలేదు. పరాయి పాలన నుంచి విముక్తి పొందేందుకుగాను...ప్రజానీకం కారాగార శిక్షలకు, ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడిన వేళ...ఆర్‌ఎస్‌ఎస్‌ వారు క్షమాపణ లేఖలతో పీడక బ్రిటిష్‌ ప్రభుత్వ కటాక్ష వీక్షణలకు పాకులాడారు.
ఆనాడు ప్రజలు దేశవ్యాప్తంగా బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాటాలు చేస్తున్న సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి మితవాద, మతోన్మాద శక్తులు బ్రిటీష్‌ వారికి అనుకూలంగా వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం బ్రిటిష్‌ వారి ముందు పూర్తిగా సాగిలపడింది. బ్రిటిష్‌ వారి 'విభజించు పాలించు' ఎత్తుగడకు వీరు అత్యంత చురుకుగా సహకరించారు. అంతేగాక బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి విశ్వసనీయ సేవకులుగా మారి వారి ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ నెత్తిన పెట్టుకుని పూజించే నాయకుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. హిందూ సమాజ నాయకుడీయన. తదనంతర కాలంలో హిందూ మహాసభ నుంచి వేరుపడి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త కూడా. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచురించి పంపిణీ చేసే విద్యాభారతి పాఠ్య పుస్తకాల్లో వి.డి.సావర్కర్‌ను వీర సావర్కర్‌గా ప్రస్తుతిస్తూ అనేక కథనాలు అచ్చొత్తారు. అలాంటి 'వీరుడు' బ్రిటిష్‌ పాలకులకు 'క్షమాపణ పత్రాలు' రాసిచ్చిందే గాక వారితో షరీకయ్యాడనేది చరిత్ర. గాంధీజీ హత్య కేసులో ముద్దాయి కూడా అయిన ఈ వీర సావర్కర్‌ తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా శిక్ష పడకుండా తప్పించుకున్నాడు.
భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, అష్ఫాఖుల్లాఖాన్‌ వంటి యువ కిశోరాలు తమ జీవితాలను తృణ ప్రాయంగా భావించి బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులను క్షమాభిక్ష కోరడానికి నిరాకరించారు. కాని బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి ఆది గురువైన ఈ వీర సావర్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి మొత్తం ఐదు సార్లు క్షమాభిక్ష పిటిషన్లను (1911, 1913, 1914, 1918 మరియు 1920 లలో) సమర్పించాడు. అండమాన్‌ సెల్యులార్‌ జైలు నుంచి విముక్తి కావడానికి 1913 నవంబర్‌ 14న బ్రిటిష్‌ ప్రభుత్వానికి రాసిన క్షమాభిక్ష లేఖలో...తనని తాను బ్రిటిష్‌ ప్రభుత్వానికి దత్తపుత్రుడిగా అభివర్ణించుకున్నాడు. 'తండ్రి వంటి ప్రభుత్వం తలుపులు తడుతున్నా, లోనికి అనుమతించండని' అభ్యర్థించాడు. 1911లో తాను రాసిన ఉత్తరాన్ని కూడా అందులో ఉదహరించాడు. అంతేకాదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అటల్‌ బిహారి వాజ్‌పేయి అనే పెద్దమనిషి...బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో అప్రూవర్‌గా మారి అనేకమంది స్వాతంత్య్రోద్యమ నాయకుల అరెస్టుకు సహకరించాడు. వారి క్షమాభిక్ష పిటిషన్లు చదివితే బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల చూపిన విధేయత మనకు అర్ధం అవుతుంది.
ఇటువంటి ఫాసిస్ట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తుల రిమోట్‌ కంట్రోల్‌లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, అనేక రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు నడుస్తున్న నేపథ్యంలో మన దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది.
తీరా ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే...స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వారు ఒక్కరు కూడా తమకు లేకపోవడంతో...మాజీ ప్రధాని ఎ.బి.వాజ్‌పేయి 'క్విట్‌ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిస్తోంది. క్విట్‌ ఇండియాలో భాగంగా 27.8.1942న బటేశ్వర్‌ ఫారెస్ట్‌ కార్యాలయం ముట్టడి ఉద్యమంలో వాజ్‌పేయి పాల్గొన్నారని వారు చెప్పే వాదన కూడా అబద్ధమేనని తేలిపోయింది. ఇదీ నికార్సయిన దేశభక్తులం మేమేనంటూ రొమ్ము విరుచుకుంటున్న దేశ భక్తుల ద్రోహ చరిత్ర.
మన దేశ శ్రామిక వర్గం స్వాతంత్య్ర ఉద్యమంలో తిరుగులేని పాత్రను పోషించడమే గాక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. తన వర్గ ప్రయోజనాలను కాపాడుతూనే, దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం కార్మిక వర్గం సమరశీలంగా పోరాడింది.
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా ఉండి, స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసిన శక్తుల మూలంగా దేశ ఐక్యతకు, జాతీయ సమగ్రతకు సార్వభౌమాధికారానికి నేడు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. సంపద సృష్టికర్తలైన కార్మికులు, కర్షకులు, శ్రమజీవుల ప్రయోజనాలకు ద్రోహం చేసి, దేశీయ, విదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న 'దేశద్రోహుల ఆట కట్టించేందుకు..తమ చారిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించేందుకు..కార్మిక, కర్షక కష్టజీవులంతా మళ్లీ ముందుకు రావాలి. ఐక్యంగా ఉద్యమించాలి.