Oct 05,2022 10:29

బస్తీ (యుపి) : సామాజిక మాధ్యమాల్లో వైద్యుడు ఓ మహిళతో స్నేహం చేశాడు. ఓసారి ఆమెను ఆసుపత్రికి రావల్సిందిగా ఆహ్వానించాడు.. ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళపై మరో ఇద్దరు వైద్యులతో కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం మేరకు ...కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా మహిళతో స్నేహం ఏర్పరుచుకున్నాడు. తన ఆసుపత్రికి రావాలని సదరు మహిళను ఆహ్వానించాడు. దీంతో ఆమె ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. నిందితుడు అక్కడి నుంచి తన హాస్టల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులైన తన ఇద్దరు సహచరులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రయివేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తనపై అత్యాచారం జరిగినట్లు గత నెల 27 న మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు వైద్యుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.