May 27,2023 08:02

          ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో...వాస్తవాలను అందించే అంతర్జాతీయ నివేదికలు, రిపోర్టులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్వేషించి వివిధ దేశాల, ప్రాంతాల, జాతుల వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసే ప్రయత్నాలు చేస్తున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, ఆక్స్‌ఫామ్‌ సంస్థ అందరి మన్ననలను పొందుతున్నాయి.
          వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యు.ఇ.ఎఫ్‌) తాజాగా వెలువరించిన నివేదిక 'గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2023' పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చింది. రానున్న రెండేళ్లలో ప్రపంచాన్ని అత్యంత ఎక్కువగా కుదిపేసేది జీవన వ్యయం ('కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌') అని, రానున్న దశాబ్ద కాలంలో జీవన ప్రమాణాలను అత్యంత ప్రభావం చేసేది పర్యావరణ మార్పులు అని సోదాహరణలతో రిపోర్టులో పేర్కొన్నది. ఈ అంశాన్ని ఒకసారి నిశితంగా పరిశీలించి భారతదేశ ప్రజల సంపాదనలకు పోల్చి చూసినప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో కార్ల కంపెనీలకు సంబంధించిన రిపోర్టు ఒకటి వెలువడింది. దాని ప్రకారం చిన్న కార్లు, తక్కువ ధరకు లభించే కార్లకు గిరాకీ బాగా పడిపోయిందని, మధ్యతరగతి పైన అనగా ఎస్‌యువి (స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌) రేంజ్‌ కార్ల గిరాకీ పెరిగిందని తెలిసింది. ధనవంతులు ధనవంతులుగా, పేదలు పేదలుగా మారే ప్రక్రియకు ఇది చక్కటి ఉదాహరణ. అనగా బాగా సంపాదిస్తున్న వారి సంపాదనలో విపరీతమైన పెరుగుదల ఉంటే, తక్కువ సంపాదిస్తున్న వారి సంపాదనలో తగ్గుదల ఉంది-అని నిరుడు ఆక్స్‌ఫామ్‌ సంస్థ ఇచ్చిన రిపోర్టును ఇది ధ్రువీకరిస్తున్నది. నిజానికి ఆర్థిక వ్యవస్థ సమతుల అభివృద్ధి సాధిస్తే చిన్న కారుల గిరాకీ పెరగాలి. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి కూడా మరింత పెరుగుతుంది. అలా కాకుండా విలాసవంతమైన వస్తువుల వినియోగం పెరిగితే అది విశాల అభివృద్ధికి సూచిక కాదు. కోవిడ్‌ అనంతరం భారతదేశంలో గ్రామ స్థాయిలో ఆహార వస్తువుల వినియోగం పెరిగింది. దీనికి ప్రధాన కారణం వలసలు. పట్టణాల నుండి గ్రామాలకు తిరిగి వెళ్లడంతో అక్కడ ఆహార వస్తువుల వినియోగం పెరిగింది. అందుచేత వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అభిప్రాయ పడినట్లు రాబోయే రోజుల్లో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇక 30 ఏళ్ల నుండి అనేక దఫాలుగా అంతర్జాతీయ వేదికలపై వాగ్దానాలు కురిసినప్పటికీ పెరుగుతున్న కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే తక్షణ చర్యలు అభివృద్ధి చెందిన దేశాలలో ఏమాత్రం కనిపించడం లేదు. అందుచేత విపరీతమైన పర్యావరణ మార్పుతో ప్రధానంగా ప్రభావితమయ్యేది ఆఫ్రికా, ఆసియా ఖండాల ప్రజలు. ఎందుకంటే వాతావరణ మార్పులు పారిశ్రామిక ఉత్పత్తులపై ప్రభావం చూపడమే కాకుండా ప్రజల ఆహార వినియోగం ప్రకృతి స్వావలంబన, సమైక్య జీవన విధానంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపేవి ఈ ప్రదేశాలలోనే.
          ఉపాధి సంబంధిత అంశాలపై ఆసక్తి గొలిపే రిపోర్టు ఇది. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని మొత్తం ఉపాధుల్లో 23 శాతం మార్పులు చోటు చేసుకుంటాయని డబ్ల్యు.ఇ.ఎఫ్‌ అభిప్రాయపడింది. అనగా సగటున 23 శాతం ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, తొలగింపులు, వేతన తగ్గింపులు, ఉపాధి సంబంధిత కాంట్రాక్టుల్లో మార్పులు వంటివి సంభవిస్తాయని తెలిపింది. అయితే ఈ రిపోర్టు వెలువడక ముందే గత ఏడాది ప్రపంచ దిగ్గజ సంస్థలు అనేకమంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగించాయి. లేదా పీస్‌ రేట్‌ సిస్టమ్‌ అనే విధానంతో పనులు పూర్తి చేయించుకునేలా అంగీకారాలు కుదుర్చుకోవడం మనం చూశాం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే రానున్న కాలంలో 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని, 8.3 కోట్ల ఉద్యోగాలు తొలగించబడతాయని రిపోర్టు తెలుపుతోంది. దీన్ని చదివినప్పుడు ఒకింత గందరగోళంగా అనిపిస్తుండవచ్చు. కానీ వాస్తవం ఏమంటే మారుతున్న సాంకేతిక ఇతరత్రా కోణాల దృష్ట్యా ఇప్పుడున్న ఉద్యోగులు చేసే పనికి సరితూగే అవకాశం లేనందువల్ల 8.3 కోట్ల మందిని సంస్థలు తొలగించనున్నాయన్నమాట. వారి స్థానంలో 6.9 కోట్ల మందిని నియమించుకోనున్నారు. తొలగించబడనున్న ఈ 8.3 కోట్ల మంది, కుదిరితే తక్కువ స్థాయి ఉద్యోగాలను ఎంచుకోవడం లేదా మరోరకంగా కష్టపడటమే దారిగా కనిపిస్తున్నది. ఇది ఒక ఎత్తైతే రానున్న ఐదేళ్లలో మార్కెట్లోకి ఉపాధి వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ కేవలం 6.9 కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభించే అవకాశం ఉందని తెలుస్తుండటం చాలా ఆందోళన కలిగించే అంశం.
          ఒక దశాబ్దం కిందట మన దేశంలో 10 లక్షల పైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఉంటే ఇప్పుడిది ఆరు లక్షలు ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, డిఫెన్స్‌, రైల్వే ఉద్యోగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
         గత రెండు దశాబ్దాల కిందట విపరీతమైన ఆశావాహంతో ప్రవాహంలా దూసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒక్క టిసిఎస్‌ కంపెనీ గత ఏడాది నాలుగు లక్షల ఉద్యోగులను నియమించుకుంటే ఈ ఏడు కేవలం ఎనబై వేల నియామకాలు మాత్రమే చేపట్టింది. ''పెట్టుబడి-లాభదాయకమైన రిటర్న్‌'' అనే కాన్సెప్ట్‌ అంతర్జాతీయంగా పెరిగింది. మానవాభివృద్ధిపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం లేదు. ఇటువంటి విధానాల వల్ల, ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లను దేశాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రకమైన ఉపాధి లేమి సమస్య అన్ని దేశాలను పట్టి పీడించే అవకాశం ఉందని రిపోర్టు అభిప్రాయపడింది.
           కోవిడ్‌ మహమ్మారి మిగిల్చిన అభద్రత, అంతం లేకుండా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆహార, చమురు ధరలను స్థిమితం లేకుండా చేస్తున్నాయి. దాని ప్రభావం వల్ల అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి రక్షణాత్మక చర్యల వలన సామాన్య ప్రజల జీవన స్థితి సన్నగిల్లి, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని రిపోర్టు సోదాహరణంగా వివరించింది. రక్షణాత్మక చర్యలతో పాటు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ ఇతరుల ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు ప్రపంచ దేశాల్లో రానున్న రోజుల్లో మరింత ముమ్మరం అవుతాయని ఈ రిపోర్టు తెలిపింది. వీటిని గమనిస్తే ప్రస్తుతం అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాల వ్యవహారాలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.
          ఈ నివేదికను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లపై. కొత్త స్టార్టప్‌లు, స్వయం ఉపాధి మార్గాలతో పాటు వృత్తి విద్యా విధానాలు అవలంభించడంతో దీన్ని అధిగమించే అవకాశం ఉంది.
 

- జి. తిరుపతయ్య
సెల్‌: 9951300016