Aug 05,2022 10:09

తరతరాలుగా అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న ప్రజల మధ్య మత విద్వేషాగ్నులు రగిల్చి, మానవతపై దాడి చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌) సంస్కృతి. స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్‌వారి విభజించు పాలించు విధానాన్నే ఆరెస్సెస్‌ అప్పుడు, ఆ తరువాత కొనసాగిస్తూ వచ్చింది. దీనిలో భాగమే గాంధీజీ హత్య, నుంచి గాంధీనగర్‌ హత్యాకాండ దాకా..

జాతి పిత మహాత్మా గాంధీ హత్య దగ్గర నుంచి గాంధీనగర్‌ హత్యాకాండ (గుజరాత్‌ నరమేధం) వరకు సంఫ్‌ు పరివార్‌ సాగించిన పాపాలు చరిత్రలో చీకటి అధ్యాయాలుగా లిఖించబడ్డాయి. సంఫ్‌ు పరివార్‌ పాలకులు భారతీయుల్లో ఒక తరగతికి వ్యతిరేకంగా మరో తరగతిని నిలబెడుతూ ప్రజాతంత్ర లౌకిక భారత దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నదీ మనం చూస్తున్నాం. తరతరాలుగా అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న ప్రజల మధ్య మత విద్వేషాగ్నులు రగిల్చి, మానవతపై దాడి చేస్తున్న ఈ శక్తులకు స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్‌వాడికి దాసోహమనడం తప్ప ఎదిరించి పోరాడిన చరిత్ర లేదు.హిందూ- ముస్లిం భాయి భాయి అన్నందుకు మహాత్మ గాంధీని 1948లో దారుణంగా హత్య చేసిన గాడ్సే ఎవరు? ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తి కాదా? 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి వేసి దేశవ్యాపితంగా మత ఘర్షణలు సృష్టించి వేలాది మందిని పొట్టనబెట్టుకున్న చరిత్ర ఎవరిది? సంఫ్‌ు పరివార్‌ది కాదా? గుజరాత్‌లో గోద్రా రైలు దగ్ధం అనంతరం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మూడు నెలల పాటు సాగించిన మారణహౌమాన్ని సాగించిందెవరు? సంఫ్‌ు పరివార్‌, దాని అనుబంధ మూకలు కాదా? ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఆది నుంచి ఆరెస్సెస్‌ది ఇదే వరస.
      ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి హిందూ ఆత్మ గౌరవ పరిరక్షణకు ప్రతీకగా చూపడం దాని ఫాసిస్టు స్వభావాన్ని తెలియజేస్తుంది.. నాటి గాంధీ హత్య నుంచి ఇటీవల గుజరాత్‌ నరమేధం వరకూ జరిగిన ఘటనలను పరిశీలిస్తే..

మహాత్ముడి హత్య : ó 1948 జనవరి 30న హిందూత్వ ఉగ్రవాది నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు జాతిపిత నేలకొరిగారు. ఈ దారుణ సంఘటన యావద్దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. జాతి యావత్తూ విషాదంలో ఉండగా ఆరెస్సెస్‌వారు మాత్రం మిఠాయిలు పంచుకున్నారు. గాంధీ హత్య తరువాత, 1948 ఫిబ్రవరి 27న సర్దార్‌ పటేల్‌, నెహ్రూకు లేఖ రాస్తూ.. ''ఇది కచ్చితంగా సావర్కర్‌ నేతత్వంలోని హిందూ మహాసభకు చెందిన ఓ మతోన్మాద శాఖ పన్నిన కుట్ర'' అని అన్నారు. అలాగే, 1948, జూలై 18న శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి రాసిన లేఖలో గాంధీ హత్య గురించి పటేల్‌ ప్రస్తావిస్తూ.. ''ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ కార్యకలాపాల ఫలితంగా దేశంలో ఇంత దారుణానికి ఒడిగట్టే పరిస్థితి దాపురించింది''అని రాశారు.
 

                                                                                బాబ్రీ విధ్వంసం

అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న చోటు రాముడి జన్మ స్థలమంటూ ఆరెస్సెస్‌, బిజెపి పెద్దయెత్తున ప్రచారం చేశాయి. దీనికి పురావస్తు శాఖ పరిశోధనల్లో కానీ, చారిత్రికంగా కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎవరూ దీనిని రుజువు చేయలేకపోయారు. దీంతో, ఇది విశ్వాసానికి సంబంధించినదంటూ సంఫ్‌ు పరివార్‌ బుకాయించి, ఆ చారిత్రిక కట్టడాన్ని కూల్చివేసింది. యుపిలోని బిజెపి ప్రభుత్వం దీనికి పూర్తిగా సహకరించింది, దీనికి కేంద్రంలోని పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కూడా తోడవడంతో సంఫ్‌ు పరివార్‌ శక్తులకు అడ్డు అదుపులేకుండా పోయింది. మసీదు కూల్చివేతకు ముందు, తరువాత హిందూత్వ శక్తులు సృష్టించిన అలర్లలో వేలాది మంది చనిపోయారు. పెద్దయెత్తున ఆస్తులు ధ్వంసమయ్యాయి. బాబ్రీమసీదు కూల్చివేత స్వతంత్ర భారత చరిత్రలోఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.

గుజరాత్‌ నరమేథం : బాబ్రీ మసీదు కూల్చివేసిన పదేళ్లకు గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోసిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. గోద్రా అనంతర గుజరాత్‌ మారణకాండలో ఆర్‌ఎస్‌ఎస్‌ సాయుధ విభాగమైన బజరంగ్‌ దళ్‌, విహెచ్‌పి పాత్ర అందరికీ తెలిసిందే. మోడీ నాయకత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వ ప్రత్యక్ష సహకారంతోనే ఇదంతా సాగిందని మాజీ డిజిపి శ్రీకుమార్‌, ఎస్పీ సంజీవ్‌ భట్‌ వంటి పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు కమిషన్లు ఇచ్చిన నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ అల్లర్లలో కాంగ్రెస్‌ ఎంపితో సహా 2వేల మంది వరకు చనిపోయారు.