Aug 06,2022 06:51

ఈ మధ్యకాలంలో మహిళా పోలీసు అధికారులు తమ వృత్తిలో భాగం కాకపోయినా కొన్ని సమాజసేవకు తమ వంతు కృషి చేస్తున్నారు. అమీనా కూడా ఆ కోవకే చెందుతారు. బతుకు ఎలాంటిదైనా చావు మాత్రం అంత హీనంగా ఉండకూడదని ఆమె భావించారు. పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే గుర్తుతెలియని మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చులను ఆమె భరిస్తున్నారు.తమిళనాడుకు చెందిన అమీనా 2010లో పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరింది. మెట్టుపాళయం స్టేషన్‌లో మొదట అసిస్టెంట్‌ రైటర్‌గా విధులు నిర్వహించారు. ఆమె గత ఐదేళ్లుగా మెడికో-లీగల్‌ ప్రొసీజర్‌లను పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని మృతదేహాలను దహన కార్యక్రమంలో ఆమె దగ్గరుండి ఖననం చేయిస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చును తానే పెట్టుకుంటుంది.
తాను పని చేస్తున్న మెట్టుపాళయం స్టేషన్‌ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది భిక్షాటన చేసే అనాధలు, గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. ఆ మృతదేహాల కోసం ఎవరూ వచ్చేవారు కాదు. కనీసం ఆ మనిషి చనిపోయారని బాధపడేవాళ్లు కూడా ఉండేవారు కాదు. పోస్టుమార్టం అయిన మృతదేహాన్ని అనాధ శవానికి దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఈ విషయం అమీనా మనుసును ఎంతోగానో బాధపెట్టింది. బతుకు ఎలా ఉన్నా... కనీసం చనిపోయినప్పుడైనా జరిగే కార్యక్రమాల్లోనైనా తాను పాల్గొనాలనుకుంది. తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానే చూస్తున్న పనికి మరి కొంత సమయం కేటాయిస్తుంది. అనాధ, గుర్తు తెలియని మృతదేహాల పోస్ట్‌మార్టం తర్వాత ఆ శవాన్ని మున్సిపాల్టీకి అప్పగించాలి. కాని అమీనా మాత్రం మున్సిపాల్టీ నుంచి ఒక లేఖను తీసుకుని, శ్మశానవాటిక దగ్గరకు వెళుతుంది. ఆ మృతదేహానికి పూలు జల్లి, దండలు వేస్తుంది. పూడిక కోసం గుంట తవ్వించి, కర్మకాండలను చేస్తుంది. ఇందుకుగానూ ఆమెకు ప్రతిసారి రూ.1500లకు పైగా ఖర్చు అవుతుంది. మొత్తం తానే ఖర్చు చేస్తుంది. అప్పుడప్పుడు సహోద్యోగుల సహకారం కూడా తీసుకుంటుంది.
అంతేకాదు, ఐదేళ్ల నుంచి అమీనా కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులో అనాధ మృతదేహాలను జీవ జ్యోతి ట్రస్ట్‌ సభ్యులతో కలిసి దహన సంస్కార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ సేవలను గుర్తించి జిల్లా ఎస్పీ వి బద్రీనారాయణన్‌ అమీనాను అభినందించి సన్మానించారు.