May 29,2023 21:55
  • విజయవంతంగా నింగిలోకి రాకెట్‌
  • త్వరలో మరో 4 నావిగేషన్‌ ఉపగ్రహాలు : ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా), అమరావతి బ్యూరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించిన మరో రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుండి సోమవారం ఉదయం 10.42 గంటలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌12 రాకెట్‌ను ప్రయోగించారు. ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిర్విరామంగా 27.30 గంటలపాటు కొనసాగింది. నిర్దేశించిన సమయానికి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువైన ఎన్‌విఎస్‌-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని 18 నిమిషాల 45 సెకండ్ల వ్యవధిలో భూధృవ నిర్ధిష్ట కక్ష్యలోకి ఇస్త్రో శాస్త్రవేత్తలు చేర్చారు. శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది ఇప్పటికే నెలకు ఒక రాకెట్‌ చొప్పున ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకూ నాలుగు రాకెట్లను ప్రయోగించారు. అవన్నీ విభిన్న తరహా రాకెట్లు కావడం విశేషం. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ అంతరిక్ష కక్ష్యలో ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలకు కాలం చెల్లిపోతున్న నేపథ్యంలో మరో నాలుగు నావిగేషన్‌ ఉపగ్రహాలను ఆరు నెలల వ్యవధిలో ప్రయోగించనున్నట్లు తెలిపారు. భారత భూభాగం నుండి 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ నావిగేషన్‌ ఉపయోగపడుతుందని, రోడ్‌ మార్గం, వాయు మార్గం, జల మార్గంలో జిపిఎస్‌ తరహాలో దారి చూపుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మిషన్‌ డైరెక్టర్‌ గిరి, స్పేస్‌ క్రాఫ్ట్‌ డైరెక్టర్‌ కెవిఎస్‌.భాస్కర్‌, శాక్‌ డైరెక్టర్‌ నీలేష్‌ ఎన్‌ దేశారు, యుఆర్‌ఎస్‌సి డైరెక్టర్‌ శంకరన్‌, షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్‌ నారాయణన్‌ తదితరులు పాల్గన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నరు, సిఎం అభినందనలు
జిఎస్‌ఎల్‌విాఎఫ్‌12 ద్వారా నావిక్‌ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నరు జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో ప్రయోగించిన రెండవతరం ఉపగ్రహంలో మొదటిదైన ఎన్‌విఎస్‌ా01 నావిగేషన్‌ సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.