Oct 02,2022 06:54

గాంధీజీని మహాత్ముడని, జాతి పిత అని దేశమంతా కొనియాడే కాలంలో లేము. గాంధీజీని హతమార్చిన గాడ్సేని దేశభక్తుడని స్వయంగా పార్లమెంటు సభ్యులు (బిజెపి వారు) నిస్సిగ్గుగా మాట్లాడుతున్న కాలంలో వున్నాం. గాంధీజీ వర్థంతి రోజున ఆయన బొమ్మను పిస్తోలుతో కాల్చి 'గాడ్సే జిందాబాద్‌, గాంధీ మురదాబాద్‌' అని వికృతంగా కేకలు పెట్టి, ఈ మొత్తం తతంగాన్ని సోషల్‌ మీడియాలో పెట్టిన ప్రజ్ఞా ఠాకూర్‌ని మధ్యప్రదేశ్‌లో ప్రజలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న కాలానికి చేరాం. గాంధీజీని ఆరాధించే వాళ్ళు పొగిడి...ఆయనని హతమార్చిన వాళ్ళూ పొగడడంలో ...స్వాతంత్రోద్యమానికి తిరుగులేని నాయకత్వం వహించిన ఆయన గురించి, నాటి స్వాతంత్రోద్యమం గురించి దేశానికి తెలియకుండా చేయాలన్న కుట్ర ఇమిడి వుంది. అందువలన పొగడ్తలు సరిపోవు. గాంధీజీ జీవితాన్ని, ఆయన సిద్ధాంతాలను చదవాలి. అంతేకాదు. నేటి తరానికి వివరంగా చెప్పాలి. అప్పుడే ఆయన్ని హతమార్చి, ఆయన సిద్ధాంతంపై విషం కక్కుతూ నేడు అందలమెక్కిన వారి అంతు చూడగలం. ఈ క్రమంలో గాంధీజీ వారసులుగా చెప్పుకునే వారి గురించి కూడా చెప్పుకోవాలి. అలాగే స్వాతంత్రోద్యమంపై గాంధీజీ తిరుగులేని ప్రభావం, ఆయన సిద్ధాంతం, దాని వర్గ స్వభావం, స్వాతంత్య్రానంతరం జరుగుతున్న పరిణామాలు... అన్నింటినీ తెల్సుకోవాలి.
హైదరాబాద్‌ లోని గాంధీ జ్ఞానమందిరంలో (1957వ సంవత్సరంలో) కామ్రేడ్‌ సుందరయ్య చేసిన ప్రసంగంలో ''మహాత్మా గాంధీ నిరంతరం హిందూ-ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తూ వచ్చారు. ఆఖరికి ఆ కృషి లోనే ఒక హిందూ మతోన్మాది చేతులో తుపాకి కాల్పులకు బలయ్యారు. సమానత్వం అనేది గాంధీ సిద్ధాంతాలలో కీలకం. దక్షిణాఫ్రికాలో తెల్లవారితో నీగ్రోల సమానత్వం, చంపారన్‌ (బీహార్‌)లో రైతుల సమానత్వం, అన్ని కూలాల వారి సమానత్వం, హిందూ ముస్లింల సమానత్వం, ఆర్థిక అసమానతలు తొలగించి సమానత్వం సాధించడం కోసం మొత్తం ఆయన జీవితమంతా సమానత్వం కోసం పోరాడారు. సమానత్వమనేది ఆయన నడిపిన ఉద్యమాలన్నింటికీ కీలక బీజం. ఈ సమానత్వం సాధించాలనే కర్తవ్యం ఇంకా మిగిలే వుంది. దాన్ని సాధించాలి. అలా సాధించినప్పుడే గాంధీజీ ఆశయాలు నెరవేర్చిన వారమవుతాం.'' అని చెప్పారు. ఆ ప్రసంగంలోనే ఆయన ''స్వాతంత్య్రం సాధించడానికి గాంధీయిజం పునాదులు వేసింది. స్వాతంత్య్రం అనే మన ఆశయాన్ని సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్రను కమ్యూనిస్టులు గుర్తిస్తారు. కాని అంత వరకు మాత్రమే. గాంధీజీ సిద్ధాంతాలు అంతకు మించి ముందుకు పోవడానికి తోడ్పడవు'' అని తేల్చిచెప్పారు. నిజానికి గాంధీజీనే స్వాతంత్య్రం వచ్చిన తీరు, ముఖ్యంగా దేశ విభజన ఆ సందర్భంగా భయానకమైన మత కలహాలు, మారణకాండ, స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ నాయకుల విపరీత ధోరణులపై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ''రాజ్యాంగ సభకు సభ్యులుగా వుండగోరే వారి నుంచి నాకెన్నో ఉత్తరాలు వస్తున్నాయి. ఈ ఉత్తరాలు మేధావి వర్గానికి దేశ స్వాతంత్య్రం మీద కంటే స్వంత లాభాల మీదనే దృష్టి వున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది చూస్తే భయం వేస్తోంది. ఈ దరఖాస్తులు ఒక జబ్బుకు లక్షణం. ఈ విషయంలో నా సహాయం కోరవద్దని చెప్పడం కంటే రోగ లక్షణాల్ని ప్రజలకు చూపించడానికేననేది వ్రాస్తున్నాను.'' అని ప్రకటించారు. గాంధీజీ అనుచరులందరూ స్వాతంత్య్ర ఉత్సవాలు చేస్తుంటే ఆయన భారత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా వున్నాయని కలత చెందారు. అదే విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ఈ అస్థిర పరిస్థితులకు కారణం-హిందూ, ముస్లిం తగాదాలు. అవి ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య తగాదాలుగా రూపం తీసుకోవడం. రెండవది కాంగ్రెస్‌ సంస్థలో ప్రవేశించిన కుళ్ళు, పతనము. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన బతికి వున్నది కేవలం ఐదున్నర నెలలు మాత్రమే. కానీ ఆయన గొప్పతనమేంటంటే ఆ అతి కొద్ది కాలంలోనే భారతదేశ భవిష్యత్‌ ఎలా వుండబోతున్నదో అర్థం చేసుకోవడం, ప్రజల్ని హెచ్చరించడం, చివరకు భగవంతుడి మీద భారం వేయడం తప్ప ఆయనకు మరో దారి తోచలేదు. 1947లో తన జన్మదినం సందర్భంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు...''హిందువైనా, ముస్లిం అయినా మరొకరయినా పరమ కిరాతకంగా సాగించే ఈ హత్యాకాండను చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చునే పరిస్థితిలో నన్ను పెట్టే కన్నా ఈ దు:ఖమయ ప్రపంచంలో నుండి తీసుకుపోవాల్సిందిగా సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.'' అని చెప్పారు. (మహాత్ముడు ఆయన సిద్ధాంతాల నుండి)
75 సంవత్సరాల సాక్ష్యం
స్వాతంత్య్రానంతరం గడచిన 75 సంవత్స రాలను రెండు భాగాలుగా చూడొచ్చు. ఒకటి హిందూత్వ శక్తులు బలపడటానికి ముందు అంటే 1992 (బాబ్రీ మసీదు విధ్వంసం 1992 డిసెంబరు 6), ఆ తరువాతగా చూడొచ్చు. గాంధీజీ వ్యక్తం చేసిన భయాందోళనలను బట్టి చూసినప్పుడు ఈ రెండూ విడి భాగాలు కాదు. పరస్పరం కలిసి వుండేవి. మొదటి దశ కొనసాగింపుగానే రెండవ దశను చూడటం అవసరం. అప్పుడే గాంధీజీ సిద్ధాంతానికి ఆయన సహచరులు, అనుచరులు చేసిన అపార నష్టం...ఆ నష్టాన్ని వినియోగించుకుంటూ...హిందూత్వ శక్తులు తమ విష ప్రచారాన్ని వందలు, వేల రెట్లు ఎలా పెంచుకుంటూ పోయాయో అర్ధం అవుతుంది.
గాంధీజీని చంపినా...  వారి లక్ష్యం ఇంకా నెరవేరలేదు
గాంధీ మహాత్ముడి హత్యకూ తమకు ఏ సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ అంటాడు. 1947 డిసెంబర్‌లో గాంధీజీ హత్యకు కొద్ది రోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలతో చేసిన ఉపన్యాసంలో గోల్వాల్కర్‌ ఏమన్నాడో చూడండి. ''ఈ భూమి మీద వున్న ఏ శక్తి ముస్లింలను హిందూస్తాన్‌లో నిలపలేదు. వాళ్ళు ఈ దేశం వదిలి పోవాల్సిందే. ఎన్నికల్లో వారి ఓట్లతో కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని మహాత్మా గాంధీ వాళ్ళను ఈ దేశంలో వుంచాలనుకుంటున్నారు. కానీ అప్పటికి ఒక్క ముస్లిం కూడా ఇండియాలో వుండడు. గాంధీ వాళ్ళని ఇంక ఏ మాత్రం మోసగించలేడు. ఇటువంటి వ్యక్తుల్ని శాశ్వతంగా నోరు మూయించే పద్ధతులు మన దగ్గర వున్నాయి. కానీ హిందువులకు హాని కలిగించని సాంప్రదాయాలు మనవి. మనకు తప్పకపోతే అటువంటి చర్యలకు కూడా పోవాల్సి వుంటుంది''.
గాంధీజీని నిర్మూలించడం ద్వారా లౌకిక ప్రజాతంత్ర రాజ్యాన్ని అంతం చేసి తీరుతామన్న హెచ్చరిక ఆర్‌ఎస్‌ఎస్‌ పంపింది. గాంధీజీ హత్యపై రోదించిన దేశం, గాడ్సేని ఆర్‌ఎస్‌ఎస్‌ని అసహ్యించుకున్న దేశం...గాంధీ సిద్ధాంతం గురించి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతమైన హిందూత్వం గురించి తీవ్రంగా తీసుకోలేదు. గాంధీజీపై కొద్దికొద్దిగా విషం కక్కిన హిందూత్వ శక్తులు ఈ రోజు బలపడిన తరువాత పూర్తి స్థాయిలో ఆయన పైన, ఆయన సిద్ధాంతాల పైన విషం కక్కుతున్నాయి. దేశం మనస్సులో నుండి గాంధీజీ స్థిరత్వాన్ని తుడిచిపెట్టే పనిలో పడింది ఆర్‌ఎస్‌ఎస్‌. అందుకోసమే గాంధీజీ హత్య కేసులో కుట్రదారుడు నెం.1 అయిన వి.డి.సావర్కర్‌ని ఆకాశానికి ఎత్తుతున్నది. గుజరాత్‌ లోని నర్మదా వ్యాలీలో 597 అడుగుల సర్దార్‌ వల్లభారు పటేల్‌ విగ్రహం ప్రతిష్టించింది అక్కడ బిజెపి రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి గుజరాత్‌ జాతీయుడి విగ్రహం పెట్టాలనుకున్నా, స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని నాయకుడైనా గాంధీజీ అవుతారు కదా! లేకుంటే తొలి ప్రధాని నెహ్రూ విగ్రహం పెట్టాలి కదా! కారణమేమంటే గాంధీజీ చాలా స్పష్టంగా హిందుత్వ సిద్ధాంత మూలాలను అసహ్యించుకునే వారు. గాంధీజీ మిత్రుడు ఆర్‌ఎస్‌ఎస్‌ వారి సేవా కార్యక్రమాల్ని ఆయన వద్ద పొగిడితే గాంధీజీ వెంటనే ''హిట్లర్‌, ముస్సోలినీ, ఫాసిస్టులు కూడా ఈ విధంగానే చేసే వారిని మర్చిపోకూడదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది నిరంకుశ మతోన్మాద సంస్థ'' అని హెచ్చరించారు.
గాంధీజీ కలలు గన్న మత సామరస్యం, ఆర్థిక సమానత్వం, నీతివంతమైన రాజకీయ వ్యవస్థ వంటివి ప్రస్తుత పాలకవర్గ పార్టీల వల్ల సాధ్యం కాదని 75 సంవత్సరాల చరిత్ర తేల్చింది. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని సార్లు మారినా దేశం మరింత ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి కూరుకు పోతున్నదే తప్ప మెరుగు కావడం లేదు. అందువలన అర్థిక, సామాజిక దోపిడీలకు గురవుతున్న ప్రజానీకాన్ని ఐక్యపరచి...కులం, మతం, జాతి, భాషల పేరిట మనిషిని మనిషి దోచుకోని ఓ ఉన్నత సమాజాన్ని సాధించుకోవాలి.

 వ్యాసకర్త: సిపియం తూర్పు కృష్ణా జిల్లా పూర్వ కార్యదర్శి ఆర్‌. రఘు