May 24,2023 21:02

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ కేసుపై విచారణ శుక్రవారం నాటికి వాయిదా పడింది. గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతోపాటు కస్టడీ తరువాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం జస్టిస్‌ పిఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాది ఎఎస్‌జి సంజరు జైన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇదో ఎనిమిదో వింత అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒక్కరోజు సమయం ఇచ్చి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా ప్రత్యేక ఎస్‌ఎల్‌పిని దాఖలు చేసినట్లు గంగిరెడ్డి తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గంగిరెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి, ఇతర అప్లికేషన్లను సునీత పిటిషన్‌కు జత చేయాలని ధర్మాసనం సూచించింది. అన్నిటినీ కలిపి విచారిస్తామంటూ తదుపరి విచారణను ఈ నెల 26కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.