
- ఐదు నెలల బకాయి కట్టాలంటూ వేధింపులు
- కట్టని వారిపై దౌర్జన్యం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : పన్ను వసూలుకు అధికారులు, సిబ్బంది వింత పోకడలను అమలు చేస్తున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌పై చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారికి చెత్తపన్ను విధించారు. ఐదు నెలల చెత్త పన్ను కట్టాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పన్ను కట్టని వారిపై అధికారులు దౌర్జన్యానికి పాల్పడు తున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగరంలోని సి.క్యాంప్ సెంటర్, కర్నూలు సర్వజన వైద్య శాఖ ఎదుట, వెంకట రమణ కాలనీ, పాత బస్టాండ్, పూల బజార్, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, టిఫిన్ సెంటర్, టీ స్టాల్, చికెన్ పకోడా, వస్త్ర వ్యాపారాలు చేసుకుంటూ దాదాపు రెండువేల మంది చిరువ్యాపారులు బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. వీటిలో చాలా వ్యాపారాలు ఒక పూట మాత్రమే సాగిస్తుంటారు. తాజాగా ప్రభుత్వం వారిపై కూడా చెత్త పన్ను పేరుతో భారం మోపుతోంది. నెలకు రూ.100 కట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. వెంకట రమణ కాలనీలో ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు సాగించే 35 మంది చిరు వ్యాపారుల నుంచి ఐదు నెలల చెత్తపన్ను పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున రూ.17,500 వసూలు చేశారు.
చెత్త పన్ను కట్టలేదని గతంలో ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను కింద పడేశారు. రూ.500 చెత్త పన్ను కట్టిన వారికి తొలుత రసీదులు ఇవ్వలేదు. వ్యాపారులు వెంటపడి అడిగితే 19 మందికి ఒక నెలకు సంబంధించిన చెత్త పన్ను రసీదును వాట్సప్ ద్వారా పంపారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం, మరో వైపు వ్యాపారాలు కూడా తగ్గడంతో రోజంతా కష్టపడినా రూ.300 నుంచి రూ.500 కూడా రావడం లేదని, అలాంటి సమయంలో చెత్త పన్ను కట్టాలంటూ వేధింపులకు గురిచేయడం సమంజసం కాదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త పన్ను రద్దు చేయాలి
ఫుట్‌పాత్ వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారి దగ్గర నుంచి చెత్త పన్ను వసూలు చేయడం దుర్మార్గం. చెత్త పన్ను కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్న, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. చెత్త పన్ను రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
- ఇ.పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం
రాష్ట్ర కమిటీ సభ్యులు.
