Sep 22,2022 20:24

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : తమ అనుమతి లేకుండా వేస్తున్న గ్యాస్‌ పైపులైన్‌ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ 12 మండలాల బాధిత రైతులు గురువారం ధర్నా చేపట్టారు. గ్యాస్‌ పైపులైన్‌ బాధితుల సంఘం ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి కూడలి నుంచి గెయిల్‌ చీఫ్‌ మేనేజర్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ గెయిల్‌ ఆధ్వర్యాన వేస్తున్న గ్యాస్‌ పైపులైన్లతో జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 99 గ్రామాలకు చెందిన సుమారు 600 మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులకు నష్ట పరిహారాన్ని ప్రకటించి, వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రైతులను సంప్రదించకుండా వారి భూముల్లో గెయిల్‌ సంస్థ పైపులైన్‌ నిర్మాణం చేయడం దుర్మార్గమన్నారు. ఏకపక్షంగా నిర్మిస్తున్న పైపులైను పనులను వెంటనే నిలుపుదల చేసి రైతులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. అత్యంత ప్రమాదకరమైన పౖౖెపులైన్‌ను సముద్రపు ఒడ్డుకు మార్చాలని, లేకుంటే వేసిన పైపులైన్లను రైతులే తొలగిస్తారని హెచ్చరించారు. ధర్నా అనంతరం గెయిల్‌ చీఫ్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొందూరు చందరరావు, గ్యాస్‌ పైపులైన్‌ బాధితుల సంఘం నాయకులు బగ్గు రాజారావు, చల్ల జయరాం, 12 మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.