
ప్రముఖ కవీ, రచయిత, గాయకుడు గంటేడ గౌరునాయుడుకు పాటే ఊపిరి. నిజానికి మిగిలిన సాహితీవేత్తల కంటె ఆయనను భిన్నంగా ప్రత్యేకంగా చూపించేది పాటే... లిన్నెట్ పక్షి గొంతులోంచి ఉదయించిన వేకువ గౌరునాయుడి పాట... అలా పొలానికెళ్ళి గట్టు మీద కూర్చుని పొలంలో గొప్పు తవ్వుతున్న ఆడవాళ్ళ జానపద రాగాలను వింటున్నట్టుంటుంది ఆయన పాట వింటే. దేశభక్తిగీతమైనా.. అభ్యుదయ గీతమైనా.. పాటలో ఆయన శైలి అమితంగా మనల్ని ఆకర్షిస్తుంది . ఆద్యంతం హృదయాన్ని తాకి ఏదో అనుభూతికి అనుభవానికి లోను చేస్తుంది. కవిత్వం ప్రతి చరణంలోను ఉప్పొంగుతుంది. 'మా దేశం భారతదేశం .. నిరుపమాన త్యాగధనుల కలలకు ప్రతిరూపం.. మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో...'' అంటూ మనల్ని దేశం పట్ల ఈ మట్టి పట్ల ప్రేమ గౌరవాన్ని పెంపొందింపజేసే ప్రేరణ కలగజేసినా.. 'నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక అయినా నా తల్లి మనసు మీగడ తరక' అంటూ మొదలై చిన్న పెద్ద అందరిలో దేశ స్వాతంత్య్ర చరిత్ర మననం చేసినా, ఆనాటి త్యాగాల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచి నేటి మన బాధ్యతలు గుర్తుచేసినా అది గౌరు నాయుడు పాటలో అలవోకగా అమరిపోతుంది..
''పువ్వుల లోకం మాది చిరునవ్వుల లోకం మాది ఎల్లలు లేని కల్లలెరుగని పిల్లల లోకమిది బాలల మరో ప్రపంచమిది'' అన్న పాట పిల్లల అమాయకమైన మనసును వారి కల్మషం లేని చిరునవ్వును ప్రతిబింబిస్తుంది. అందులోనే పిల్లల స్వేచ్ఛకు భంగం కలిగించే అంశాలను వ్యతిరేకిస్తారాయన. 'బండెడు బరువు పుస్తకాలతో వేయవద్దు సంకెళ్లు' అంటారు. అలాగే మరో గొప్ప పాట ''విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు'' అంటూ మొదలవుతుంది. అందులో కూడా బాల్యం ఎలా విద్యను అభ్యసించాలి. పిల్లలకు ఎంత ప్రజాస్వామ్యయుతంగా చదువు నేర్పించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. ''వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు / కాసుల గాలానికి విద్యార్థులు బలి కాకూడదు'' అంటూ ర్యాంకుల విద్యా విధానాన్ని నిరసిస్తారు. ''పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా'' ఉండాలని అలా ఉంటే 'తరగతి గదులే రేపటి తరగతి నిధులు' అన్న గొప్ప సందేశాన్ని సవివరంగా తెలియజేస్తారు. విద్య పట్ల ఆయనకున్న స్పష్టత ఆ పాటలో కనిపిస్తుంది. పిల్లల్ని ఎంతగా ప్రేమించకపోతే ఇలాంటి పాట రాయగలడు కవి! ా
అలాగే కష్టజీవుల శ్రమను మరిపించి వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చేది కూడా పాటే అన్న విషయాన్ని ఆయన పాట ద్వారానే తెలియజేస్తారు. 'పనికి తోడు పాట.. ఆ పాటకు సరి జోడు పని .. పనీపాట ఇద్దరూ కవల పిల్లలు''... అంటూ మానవ జీవన చైతన్యంలో, పరిశ్రమలో పాట ముందుండి నడిపించడాన్ని మనుగడ అవసరంగా పాటగానే వ్యక్తమౌతాడు. 'విచ్చుకుంటే పూలుగుప్పెడు.. అది అరకులోయ గుండె చప్పుడు''.. లాంటి పాటల్లో సౌందర్య వర్ణన కూడా విభిన్న శైలిలో మనల్ని ఆకట్టుకుంటుంది
ఆయన సుమారు వెయ్యికి పైగా పాటలు రాసినా మనకు లభ్యమౌతున్నవి రెండు వందల వరకు ఉండొచ్చు. వీటితో పాటు గజళ్ళు కూడా రాసారు. అధికశాతం పాటలు అభ్యుదయాన్ని కాంక్షించేవే. పాటకు అంత్యప్రాస అందాన్ని తెస్తుంది.. గౌరునాయుడు గారి ప్రతి పాట అంత్య ప్రాసతో అలరారుతుంది. 'కమ్ముకుంది కాలుష్యం మండుతోంది భూగోళం/ గతి తప్పి తిరుగుతోంది గమ్మత్తుగ ఋతుచక్రం'' అనే పాట మనిషి స్వార్ధం వల్ల వాతావరణానికి జరుగుతున్న అనర్ధాన్ని ఆందోళనతో కూడిన కళాత్మకతతో పాట కడతాడు. ''తొలకరి మేఘం పాడదు చినుకుల రాగం/ తల్లి నేలకు తగ్గదు పగుళ్ళ రాగం''.... పాటలో కూడా ఎక్కడా వచనంగా సాగిపోవడంతో రాజీ పడడు కవి. చివరికి ఆశతో ముగించడం పాట ప్రయోజనాన్ని మనం గమనిస్తాం
ఓ సినీ కవికార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత.. శయ నేషు రంభ అన్న మాటలతో మొదలుపెట్టి 'అపురూపమైనది స్త్రీ జన్మ' అంటూ పాటనెత్తుకుంటే ఈ కవి మాత్రం ఆ మాటలే స్త్రీ పట్ల అవరోధాలని మనకు తెలియజేస్తాడు. అందుకే 'ఎవరిదీ మాట.. ఏ వంచన వైపు ఈ బాట/ ఏ కాలం నాటిది ఇంతుల కన్నీటి ఊట' అని చెబుతూ స్త్రీ మూర్తిని దోపిడీ చేయడానికే సాంఘిక న్యాయం లేని సమాజాన్ని స్త్రీ పక్షాన నిలబడి పాటలో ప్రశ్నిస్తాడు. అలా ఆయన పాటలో అభ్యుదయం కలసి కదులుతుంది.
గౌరునాయుడు సరదాగా రాసిన పాటలు కూడా ఉన్నాయి. ఆర్టీసి బస్సులపై రాసిన పాట అందుకు ఉదాహరణ.. 'అదునుకు పనికి రాని అద్దోనం బస్సులు..' అంటాడాయన. 'ఒకదాని వెంట మరొకడు ఒకదాని వెంట ఒకటి వరస మీద వస్తాయి.. వేళా పాళా లేక వెర్రెత్తి తిరుగుతాయి/ ఆపితే ఆగవు ఆగితే కదలవు అవసరానికొక్కరికి ఆదుకోని బస్సులు..' .. ఇలా ఆర్టీసీ బస్సుల నిర్వాహకాలను చమత్కారంగా పాటలో వినిపించి హాస్యాన్ని పండించినప్పటికీ చివరి చరణంలో ఈ తీరు మారాలి ఆర్టీసి బస్సు ప్రజల కందుబాటు కావాలి అంటూ హితబోధ చేస్తారు.
అన్నీ 'పాడుదామా స్వేచ్ఛా గీత'మంత ఉధృతంగా జనంలోకి వ్యాపించి ఉండక పోవచ్చును గాని.... ఆయన చాలా పాటలు ప్రయోజనకరమైన పాటలు. ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఆ పాటల్ని పాడుతున్నప్పుడు మనం ఆ పాటల్లోకి లీన మైపోతాం. లీలగా మనగొంతు కూడా కలుపుతాం. ఏవో కొన్ని పాటలు చిన్న చిన్న మార్పులు చేయవలసినవి కూడా ఉంటే ఉండవచ్చు. వాటిని కూడా పరిశీలించి త్వరలోనే సమగ్ర సంకలనం తీసుకొస్తారని ఆశిద్దాం.
- పాయల మురళీకృష్ణ
83094 68318