
ప్రజాశక్తి-మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో పోలమాంబ అమ్మవారి జాతర అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య సిరిమాను సంబరం వైభవంగా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం స్థానిక చదురుగుడి నుండి అమ్మవారి ఘటాలను మేళతాళాల నడుమ సిరిమాను వద్దకు తీసుకువచ్చారు. అనంతరం 3.45 గంటలకు పూజారి జన్నిపేకాపు రామారావు సిరిమానును అధిరోహించారు. గరుడ వారి ఇంటి వద్ద నుంచి మొదలైన సిరిమాను తరువాత సావిడి వీధిలోని మునసబు ఇంటి ముందునుంచి సాగింది. పటిష్ట పోలీసు బందోబస్తు, రోప్ పార్టీల మధ్య ఊరేగింపు చేపట్టారు. ప్రధాన రహదారి నుండి పలు వీధులు తిరుగుతూ చావిడివీధి వరకు సాగింది. అనంతరం అమ్మవారి ఘటాలను గద్దెవద్ద ఉంచారు. సిరిమాను 5.30 గంటలకు ముగిసింది. ఈ సంబరాన్ని పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పి దిలీప్ కిరణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. డిఎస్పిలు సుభాష్, హర్షిత చంద్రకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. సిరిమానుకు రోప్ పార్టీ, పోలీస్ సిబ్బందితో రక్షణ వలయంగా ఏర్పడి ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు.
- జాతరను సందర్శించిన విజయనగరం ఎస్పి
సంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని జిల్లా ఎస్పి దీపికా పాటిల్ సందర్శించారు. జాతర విజయవంతంగా సాగేందుకు తీసుకున్న చర్యలను ఆమెకు అడిషనల్ ఎస్పి దిలీప్ కిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు
- అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సిఎం
పోలమాంబ అమ్మవారిని డిప్యూటీ సిఎం రాజన్న దొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, సాలూరు మాజీఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ దర్శించుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు డిప్యూటీ సిఎంకు ఘన స్వాగతం పలికారు అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.