Jul 02,2022 08:26

వాషింగ్టన్‌: అమెరికాలో అబార్షన్‌ క్లినిక్‌, గృహహింసకు చెందిన షెల్టర్స్‌ వంటి గోప్యతను కోరుకునే ప్రాంతాలను వినియోగదారులు సందర్శిస్తే... వారి లొకేషన్‌ హిస్టరీని తొలగిస్తామని గూగుల్‌ శుక్రవారం ప్రకటించింది. 'గోప్యతా ప్రాంతాలను సందర్శించినట్లు తమ వ్యవస్థ గుర్తిస్తే.. వారు సందర్శించిన వెంటనే లొకేషన్‌ హిస్టరీని తొలగిస్తాం' అని గూగుల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెట్‌ జెన్‌ ఫిట్జ్‌ప్యాట్రిక్‌ తెలిపారు. త్వరలో ఈ మార్పు చోటుచేసుకోబోతుందని వెల్లడించారు. సంతానోత్పత్తి కేంద్రాలు, ఎడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌, బరువు తగ్గించే క్లినిక్‌ వంటి ప్రాంతాలకు సంబంధించిన లొకేషన్‌ డేటాను కూడా గూగుల్‌ స్టోర్‌ చేయదు. మహిళలకు అబార్షన్‌ చేసుకునే రాజ్యాంగ హక్కులను తొలగిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వారం తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు ఖండించాయి. ఈ తీర్పుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయితే అబార్షన్‌కు సంబంధించిన దర్యాప్తు, విచారణల కోసం చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలు... డేటాను సేకరించడానికి వీలు లేకుండా... సమాచారాన్ని పరిమితం చేయాలని గూగుల్‌, ఇతర టెక్‌ దిగ్గజాలను సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు కోరారు. ఈ నేపథ్యంలోనే గూగుల్‌.. గోప్యతగా భావించే ప్రాంతాల లొకేషన్‌ హిస్టరీని తొలగించేందుకు సిద్ధమైంది.