
పాట్నా : పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులు తిండితిప్పలు మానుకుని... రేయింబవలు తేడా లేకుండా కష్టపడి చదువుతారు. అలా కష్టపడి చదివితేనే.. 100కి 99.. లేదా వందకి వంద రావడం కనాకష్టం. అయితే.. ఓ విద్యార్థికి 100 మార్కులకి 151 మార్కులొచ్చాయి. ఈ మార్కుల్ని చూసుకున్న ఆ స్టూడెంట్ అవాక్కయ్యాడు. చివరికి విషయం తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బిఏ ఆనర్స్) చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఓ సబ్జెక్టు (పొలిటికల్ సైన్సు)లో 100కి 151 మార్కులొచ్చాయి. ఈ మార్కుల్ని చూసి స్టూడెంట్ షాకయ్యాడు. అయితే ఈ మార్కులపై విద్యార్ధి మాట్లాడుతూ.. 'పరీక్షల్లో నాకు ఇన్ని మార్కులు రావడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే ఈ ఫలితాలు తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ..ఫలితాలు విడుదల చేసేముందు అధికారులు తనిఖీ చేసుకోవాలి. అప్పుడే విద్యార్థులు ఆందోళనలకు గురికారు' అని అన్నాడు.
కాగా, ఈ యూనివర్సిటీలోనే బీకామ్ చదువుతున్న మరో విద్యార్థికి... అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్‌కు ప్రమోట్ చేశారు. ఈ మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. కేవలం టైపింగ్ మిస్టేక్ కారణం వల్లే ఈ ఇద్దరు విద్యార్థులకు మార్కులు తప్పుగా పడ్డాయని వివరణ ఇచ్చింది. విద్యార్థుల మార్క్ షీట్లను సరిచేసి.. వారిద్దరికీ మళ్లీ కొత్త ప్రొవిజినల్ సర్టిఫిక్టెలను జారీచేయనున్నట్లు పేర్కొంది.