Oct 02,2022 21:17

రూ.కోటి బడ్జెట్‌ను కేటాయించిన సిఎం జగన్‌
ప్రజాశక్తి -అమలాపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిల రెండున్నరేళ్ల కుమార్తె హనీ గాకర్స్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆమె వైద్యం నిమిత్తం సిఎం జగన్‌ స్పందించి రూ.కోటి వరకూ బడ్జెట్‌ను కేటాయించారని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. ఈ మేరకు మొదటి విడతగా మంజూరైన ఇంజక్షన్లను ఆదివారం చిన్నారి తల్లిదండ్రులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారికి గాకర్స్‌ వ్యాధి పుట్టుకతో వచ్చిందని, ఇది చాలా అరుదుగా వస్తుందని, ఈ వ్యాధి వల్ల లివర్‌ పనిచేయదని తెలిపారు. వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని ఒక్కో ఇంజక్షన్‌ ఖరీదు రూ. 1.25 లక్షలు ఉంటుందని రాయితీపై రూ. 74 వేలు చొప్పును 13 ఇంజక్షన్లు కొనుగోలు చేసి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి అందజేశామని చెప్పారు. పాప భవిష్యత్తుకోసం ప్రదిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. పింఛను ఇప్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా 14 మంది గాకర్స్‌ వ్యాధి బాధితులు ఉన్నారని, రాష్ట్రంలో మొదటి సారిగా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విఐపి నాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మశ్రీరాణి, డిఎంహెచ్‌ఒ సిహెచ్‌ భరతలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె శంకర్రావు పాల్గన్నారు.
ఆశలు చిగురిస్తున్నాయి : పాప తల్లిదండ్రులు
వరదల సమయంలో ముఖ్యమంత్రి వచ్చినప్పుఢు ప్లకార్డుతో మా బాధను విన్నవించాం. ఆయన కాన్వారును ఆపి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వపరంగా ఆదుకుంటానిని భరోసా ఇచ్చారు. రెండు నెలల్లో వైద్య సేవలు అందడం సంతోషంగా ఉంది. పాప భవిష్యత్తుపై మాకు ఆశలు చిగురిస్తున్నాయి. ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికీ రాకూడదు. సిఎంకు రుణపడి ఉంటాం.