
ఎపిఎంఎస్‌ఆర్‌యు కౌన్సిల్ సమావేశాల్లో వక్తలు
ప్రజాశక్తి-భీమవరం రూరల్ (పశ్చిమగోదావరి జిల్లా):సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ వైద్య రంగం, ప్రభుత్వ మందులు, ఔషధ సంస్థలను బలోపేతం చేయాలని వక్తలు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని టౌన్ హాల్లో ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ (ఎపిఎంఎస్‌ఆర్‌యు) రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. సమావేశానికి అధ్యక్షత వహించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి కోటేశ్వరరావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశాల ఆహ్వాన కమిటీ చైౖర్మన్ డాక్టర్ గోపాల్‌రాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రానికి మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలని చూడడం, పోర్టులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుండడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరిట కార్పొరేట్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ఆ నిధులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏప్రిల్ ఐదున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్మిక, కర్షకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తోందని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సీమాంధ్ర డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి కృష్ణమూర్తి మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో తమకున్న సంబంధాలను వినియోగించుకుని నకిలీ మందులను అరికడతామని తెలిపారు. ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ఆలిండియా నాయకులు భట్టాచార్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగంపై ఐదు శాతం కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ మందులు, వాటి పరికరాలపై పన్నులు ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వరంగ మందుల కంపెనీలను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ శిరీష్‌కుమార్, నేతలు ఎస్ శ్రీనివాస్, కెఎంఎస్ చంద్ర, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్, జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, బి ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె క్రాంతిబాబు, మెడికల్ సేల్స్ అండ్ రిప్స్ నాయకులు పాల్గొన్నారు.