Sep 23,2022 07:56

ఎన్‌టిఆర్‌ 'వర్సిటీ' పేరు మార్పుపై ఫిర్యాదు
- బిల్లును తిరస్కరించాలని వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీని వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు గవర్నరుకే తెలియదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయం గవర్నరు తమతో అన్నారని వెల్లడించారు. వర్సిటీ పేరు మార్పుపై టిడిపి నేతలతో కలిసి గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో గురువారం కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీకి కులపతిగా ఉన్న ఆయన్ను అడిగారా? అని అడిగామని వివరించారు. తనకు తెలియదని గవర్నరు తమకు సమాధానం చెప్పారని తెలిపారు. బిల్లును ప్రవేశపెట్టారా? అని గవర్నరు తమను అడిగారని చెప్పారు. ఈ బిల్లును తిరస్కరించాలని ఫిర్యాదు చేశామని, దీనిని పరిశీలిస్తామని గవర్నరు తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. యూనివర్సిటీ కులపతిగా ఉన్న గవర్నరుకు తెలియకుండానే పేరు మార్చడం గవర్నరుకు అవమానం కాదా? అని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్‌ పేరు మార్చడంపై జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తామని, యుజిసి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. చట్టసభలో అబద్ధాల కోరుగా వ్యవహరించారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని సిఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. రాజకీయాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 32 మెడికల్‌ కళాశాలలు ఉన్నాయని, ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయో సమాచారం తెప్పించుకోవాలని పేర్కొన్నారు. టిడిపి హయాంలో 18 వైద్య కళాశాలలు వచ్చాయని, వాటిలో 13 ప్రైవేట్‌, 5 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని వివరించారు. పేరు మార్పుపై సిఎం ఎవరితో మాట్లాడారు, ఏ ఆత్మతో మాట్లాడారో తెలియదని వ్యాఖ్యానించారు. మరలా యూనివర్సిటీకి ఎన్‌టిఆర్‌ పేరు పెట్టేవరకు పోరాటం చేస్తామన్నారు. ఎన్‌టిఆర్‌ పేరు మార్చడం సబబు కాదని జగన్‌ చెల్లెలు చెప్పిందన్నారు. ఎన్‌టిఆర్‌కు, వైఎస్‌ఆర్‌కు పోలీక ఏమిటని ప్రశ్నించారు. వైద్య కళాశాల కొత్తది నిర్మించి పేరు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం ఉందని పార్టీ నేతలతో కలిసి గవర్నరుకు చంద్రబాబు అంతకముందు వివరించారు. పేరు మార్పు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. గవర్నరును కలిసిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, ఎమ్మెల్సీలు అర్జునుడు, సత్యనారాయణ రాజు, అశోక్‌బాబు, బిటి తిరుమలనాయుడు, ఎమ్మెల్యేలు అశోక్‌, కేశవ్‌, వి రామకృష్ణ, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య ఉన్నారు.